అంగన్ వాడీలకు భద్రత ఏదీ?
క్షేత్రస్థాయిలో తల్లీబిడ్డలకు సమతుల్యమైన ఆహారంతో పాటు ప్రాథమిక స్థాయి విద్యను అందిస్తూ కీలక భూమిక పోషిస్తున్న అంగన్ వాడీల జీవితాలకు ఎలాంటి భద్రత లేకుండాపోయింది.
దిశ, సిరిసిల్ల: క్షేత్రస్థాయిలో తల్లీబిడ్డలకు సమతుల్యమైన ఆహారంతో పాటు ప్రాథమిక స్థాయి విద్యను అందిస్తూ కీలక భూమిక పోషిస్తున్న అంగన్ వాడీల జీవితాలకు ఎలాంటి భద్రత లేకుండాపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో అంగన్ వాడీలకు వేతనాలు అందుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్న వారికి రూ. 15 వేలు కనీస వేతనం ఇస్తున్న ప్రభుత్వం, అంగన్ వాడీలను మాత్రం విస్మరించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత అంగన్ వాడీ టీచర్ కి రూ. 4,700 నుంచి రూ. 7 వేలకు ఒక దఫా, ఎన్నికల ముందు రూ. 7వేల నుంచి 13,650 లకు మరోదఫా వేతనాలు పెంచారు.
వీరితోపాటు అంగన్ వాడీ ఆయాలకు రూ. 2,350 నుంచి రూ. 7,800 పెంచారు. దశాబ్ధాలుగా ఐసీడీఏస్ సంస్థలో పని చేస్తున్న అంగన్ వాడీలకు వేతనం రూ. 25వేలు దాటకపోవడం గమనార్హం. వామపక్ష పార్టీలతో తమ హక్కుల సాధన కోసం పోరాటం చేస్తున్న అంగన్ వాడీలకు, వామపక్షాలను వీడితే వేతనాలు, భద్రత కల్పిస్తామని పలువురు మంత్రులు చెప్పడంతో వామపక్షాలను వీడి, తెలంగాణ ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన టీఎన్ జీఓతో కలిసి ప్రభుత్వానికి సానుభూతి పరులుగా మారారు. దీంతో ప్రభుత్వం అంగన్ వాడీలను అసలే పట్టించుకోలేదు. అంగన్ వాడీ టీచర్ పదవీ విరమణ చేస్తే రూ. 5 లక్షలు, ఆయాలకు రూ. 3 లక్షలు అందజేస్తామన్న హామీని పాలకులు తుంగలో తొక్కేశారు.
పాలకుల తీరువల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాంపెల్లి, రుద్రవరం, శివంగలపల్లి, నర్మాల క్యాంప్, శాంతినగర్ 3, నర్సింలపల్లె, తుర్కపల్లె, సంజీవయ్యనగర్ అంగన్ వాడి సెంటర్ లలోని టీచర్లు ఎలాంటి బెన్ ఫిట్స్ పొందకుండా మరణించడంతో వారి కుటుంబాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వానికి సానుభూతిపరులుగా కొనసాగితే హక్కులు సాధించలేమని గ్రహించిన అంగన్ వాడీలు, మంత్రి కేటీఆర్ సొంత జిల్లా కేంద్రం నుంచి ఎర్ర జెండా చేతపట్టి ఏఐటీయూసీలో మూకుమ్మూడిగా చేరారు. మంత్రి కేటీఆర్ ఇలాకాలోనే అంగన్ వాడీలు టీఎన్ జీఓ ను వీడి పోరుబాట పట్టిన సందర్భంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.