వన్య ప్రాణుల కోసం పెట్టిన ఉచ్చుకి యువకుడు బలి

అడవి జంతువుల కోసం వేటగాళ్లు బిగించిన ఉచ్చులో పడి ఓ నిండు ప్రాణం బలైన ఘటన మండల పరిధిలోని జై సేవలాల్ తండాలో చోటుచేసుకుంది.

Update: 2023-04-08 16:51 GMT

దిశ, కోనరావుపేట: అడవి జంతువుల కోసం వేటగాళ్లు బిగించిన ఉచ్చులో పడి ఓ నిండు ప్రాణం బలైన ఘటన మండల పరిధిలోని జై సేవలాల్ తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భూక్యా కిషోర్ (28) గత గురువారం మారిమడ్ల గ్రామానికి చెందిన మల్లేశం అనే వ్యక్తి యొక్క పొలాన్ని ట్రాక్టర్ తో చదును చేయిస్తున్నాడు. ఈ క్రమంలోనే చీకటి పడడంతో ట్రాక్టర్ ముందు దారి చూపేందుకు ముందు బైక్ మీద వెళ్లి బండి పక్కనే పార్క్ చేశాడు.

అప్పటికే అక్కడ వేటగాళ్లు విద్యుత్ తీగలు ఆమర్చడంతో అవి కిషోర్ కాలికి తగలడంతో అతను అక్కికక్కడే మృతి చెందాడు. మృతుడు కిషోర్ కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కిషోర్ మృతికి కారణమైన వేటగాళ్లను అరెస్టు చేసినట్లు వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు తీగలు తగిలి భూక్యా కిషోర్ అనే వ్యక్తి మృతి చెందిన ఘటన కోనరావుపేట మండలం భూక్యరెడ్డి తాండలో గత రెండు రోజుల క్రితం తీవ్ర విషాదాన్ని నింపింది.

కిషోర్ మృతికి కారణమైన నిందితులను వేములవాడ, చందుర్తి సీఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎనమిది మందిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు స్పష్టం చేశారు. అటవీ జంతువుల వేట కోసం వేటాడే వాళ్లు, విద్యుత్ తీగలను అమర్చిన ఎంతటి వరైనా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇప్పటి వరకు అటవీ జంతువుల మాంసాన్ని ఎవరెవరికి విక్రయించారో తెలుసుకునేందుకు గత సంవత్సరం నుంచి నిందితుల కాల్ డేటాను సేకరిస్తున్నట్లు ఆయన వివరించారు.

అటవీ జంతువుల మాంసాన్ని విక్రయించిన వారితో పాటు కొన్న వారిని కూడా కేసులో భాగస్వాములను చేస్తామని తెలిపారు. గోవిందారం తండాలో కూడా అడవి జంతువుల కోసం వేట కొనసాగిస్తున్న మరో ఎనిమిది మందిని కూడా త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఘటన జరిగిన రెండు రోజుల్లోనే కేసును చేధించిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ నాగేంద్ర చారి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో చందుర్తి సీఐ కిరణ్ కుమార్, కోనరావుపేట ఎస్సై రమాకాంత్, వేములవాడ టౌన్ ఎస్సై రఫీక్ ఖాన్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News