ప్రతి పనికీ ఓ 'రేటు'..అవినీతికి కేరాఫ్‌గా ఆర్టీఏ కార్యాలయం

తిమ్మాపూర్ మండల కేంద్రం లోని ఆర్టీఏ కార్యాలయంలో అడుగడుగున

Update: 2024-10-12 02:10 GMT

దిశ, తిమ్మాపూర్ : తిమ్మాపూర్ మండల కేంద్రం లోని ఆర్టీఏ కార్యాలయంలో అడుగడుగున అవినీతి రాజ్యమేలుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రతి పనికి ఓ రేటును ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నారని.. ఏజెంట్ల కనుసన్నల్లోనే ఈ అవినీతి దందా కొనసాగుతున్నట్లు విమర్శలు విన్పిస్తున్నాయి. కొందరు సిబ్బంది దరఖాస్తు ఫారాల పై ఏజెంట్ల 'ఇనిషియల్' ఉంటే ఒకలా.. లేకుంటే మరోలా వ్యవహరిస్తున్నారని పలువురు దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. తిమ్మాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్న మామూళ్ల పర్వం పై 'దిశ' కథనం..

ప్రతి పనికి ఓ రేటు..!

ఆర్టీఏ కార్యాలయంలో వాహనాల పర్మిట్లు, లైసెన్సుల జారీ, జరిమానాల విధింపు, నూతన వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్ ల జారీ తదితర సేవలను దరఖాస్తుదారులకు అందిస్తుండగా ఆయా పనులకు సంబంధించి ప్రత్యేకంగా ఓ రేటు ఫిక్స్ చేసుకొని మరీ మామూళ్లు వసూలు చేస్తున్నట్లు దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లైసెన్సుల జారీ ప్రక్రియలో వాహనాలు నడపకున్నా రూ.5 వేల వరకు వసూలు చేసి లైసెన్సులు జారీ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆర్టీఏ కార్యాలయంలో ఏజెంట్ లదే హవా..

ఇదిలా ఉండగా ఆర్టీఏ కార్యాలయంలో ఏజెంట్లదే హవా కొనసాగుతుందనే విమర్శలున్నాయి. కార్యాలయానికి వచ్చే దరఖాస్తుల పై ఏజెంట్ల ఇనిషియల్ ఉంటేనే ఫైల్ ముందుకు కదులుతుందని ఏజెంట్ల ప్రమేయం లేకుంటే తిప్పలు తప్పడం లేదని పలువురు దరఖాస్తుదారులు వాపోతున్నారు. సాక్షాత్తు రవాణా శాఖ మంత్రి సొంత జిల్లాలోనే ఆర్టీఏ కార్యాలయంలో ఎజెంట్ల హవా కొనసాగడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రవాణా శాఖ ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చే దరఖాస్తుదారులు కోరుతున్నారు.


Similar News