రెస్టారెంట్లలో నాణ్యత కరువు

రెస్టారెంట్, హోటల్ వ్యాపారులు కుళ్లిన నాన్ వెజ్ వంటకాలు కస్టమర్లకు వడ్డిస్తున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులు గోదావరిఖని ఎన్టీపీసీలోని రెస్టారెంట్ కు రూ.రెండు లక్షల ఫైన్ వేశారు. కానీ ఎన్నిసార్లు జరినామా విధించినా, రెస్టారెంట్లను సీజ్ చేసినా వారి తీరు

Update: 2024-10-11 10:36 GMT

దిశ, గోదావరిఖని టౌన్ : రెస్టారెంట్, హోటల్ వ్యాపారులు కుళ్లిన నాన్ వెజ్ వంటకాలు కస్టమర్లకు వడ్డిస్తున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులు గోదావరిఖని ఎన్టీపీసీలోని రెస్టారెంట్ కు రూ.రెండు లక్షల ఫైన్ వేశారు. కానీ ఎన్నిసార్లు జరినామా విధించినా, రెస్టారెంట్లను సీజ్ చేసినా వారి తీరు మారడం లేదు. నాసిరకం మసాలాలు, ఎన్నో రోజుల కిందటి చికెన్, మటన్, చేపలకు రంగులు పూసి కస్టమర్లకు అంటకడుతున్నారు.

     జిల్లాలోని గోదావరిఖని, పెద్దపల్లిలో వందలాది రెస్టారెంట్లలో నిత్యం వేలాది మంది కస్టమర్లు రకరకాల నాన్ వెజ్ వంటకాలను తింటుంటారు. వ్యాపారులు మాత్రం నాణ్యత ప్రమాణాలను పాటించకుండా కంపు కొడుతున్న వంట గదులలోఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. నాసిరకం నూనె పదార్థాలు, ప్రభుత్వాలు బ్యాన్ చేసిన చైనా పదార్థాలను వాడుతుండడంతో వినియోగదారులకు అల్సర్, ప్రేగు క్యాన్సర్​ వస్తున్నాయి.

ఎన్నోసార్లు ఫుడ్ పాయిజన్

నాణ్యతలేని, కొన్ని రోజుల క్రితం నాన్ వెజ్ వంటకాలను తినడంతో కస్టమర్లకు ఫుడ్ పాయిజన్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కల్తీ ఆహారంతో కడుపునొప్పి వాంతులు, విరేచనాలై ఆసుపత్రులలో చేరుతున్నారు. అయినా రెస్టారెంట్ యజమానులు వారి పద్ధతిని మార్చుకోవటం లేదు.

కంపు కొడుతున్న వంట గదులు

ప్రభుత్వం సూచించిన నియమ, నిబంధనలు పాటించకుండా వంట గదులను నిర్మించి అక్కడ ఇష్టం వచ్చినట్లు ఆహార పదార్థాలను పడవేయడం, సమయానికి శుభ్రం చెయ్యకపోవడంతో ఏ రెస్టారెంట్లోని వంటగదిని చూసినా కంపు వాసన వస్తుంది. వంట గదిలో వెంటిలేషన్ సరిగా లేకపోవడం, ఎలుకలు, బొద్దింకలు తిరగడం, వంటల మీద ఈగలు వాలడం కనిపిస్తుంది.

అధికారులు దాడులు చేసినా...

హెల్త్ ఇన్స్పెక్టర్లు రెస్టారెంట్లపై దాడులు చేసినప్పుడల్లా వారం రోజుల క్రితం చికెన్, మటన్, చేపలు రంగులు పూసి దొరుకుతాయి. పురుగులు పడిన బిర్యానీలు, కుళ్లిన నాన్ వెజ్ లను అధికారులు పట్టుకొని డ్రైనేజీలో వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వండిన పదార్థాలను ఫ్రిజ్లో పెట్టడం వలన అవి విష పదార్థాలుగా మారుతున్నాయి. ఇలాంటి కేసులోనే గోదావరిఖని ఎన్టీపీసీలోని ఒక రెస్టారెంట్ కు రూ.రెండు లక్షల ఫైన్ వేశారు. ఫైన్ కట్టి మరుసటి రోజే వారు వ్యాపారాన్ని ప్రారంభించారు.

పట్టణంలోని రెస్టారెంట్లపై దాడులు చేస్తున్నాం : దోర్నాల కిరణ్, హెల్త్ ఇన్స్పెక్టర్, రామగుండం కార్పొరేషన్



రామగుండం కార్పొరేషన్ లోని రెస్టారెంట్లలో కస్టమర్లకు ఇస్తున్న వంటకాలు నాణ్యత లేకపోవడంతో రెస్టారెంట్లను మూసి వేయించాం. పెద్ద మొత్తంలో ఫైన్లు వేశాం. నోటీసులు ఇచ్చాం. హోటళ్లలోని వంటకాలను పరిశీలించినప్పుడు చాలా చోట్ల ఫ్రిడ్జ్ లలో కుళ్లిన పదార్థాలు దొరికాయి. ఒకరోజు వండిన పదార్థాలను ఫ్రిజ్లో పెట్టి మరో రోజు వేడి చేసి కస్టమర్లకు ఇస్తున్నట్లు కొన్ని హోటళ్లపై ఫిర్యాదులు వచ్చాయి. హోటళ్లు తప్పనిసరిగా శుభ్రతను పాటించాలి. వంటవారు చేతికి గ్లౌజులు, తలకు క్లాత్ క్యాప్ ను ధరించాలి. కొన్ని హోటళ్లు నాణ్యత పాటించడం లేవు. వారి పై కఠిన చర్యలు తీసుకుంటాం.

కల్తీ ఆహారాలతోనే రోగాలు : డాక్టర్ ధనాల చంద్రశేఖర్. ఆర్ఎంఓ




ప్రజలు హోటళ్లలో నాసిరకం కల్తీ బిర్యానీలు, రోస్టెడ్ నాన్ వెజ్, సాస్​లు పూచిన నాన్ వెజ్ వంటకాలను తినడంతోనే అనారోగ్యానికి గురవుతున్నారు. హోటళ్లలో నాన్ వెజ్ వంటకాలకు రంగులు, టేస్టింగ్ సాల్ట్ ల వలన క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. ఏదో తప్పని పరిస్థితులలో బయటి ఫుడ్ ను తినాలి. కల్తీ ఆహార పదార్థాలు తిని ఎంతోమంది గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. వారికి వాంతులు విరేచనాలు లాంటి లక్షణాలు కనబడతాయి. కల్తీ ఆహార పదార్థాలు తిని చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రజలు కల్తీ ఆహారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

హోటల్లో నాణ్యత కరువు : పుర్మా శ్రీనివాస్,సీనియర్ న్యాయవాది



 హోటల్ యాజమాన్యాలు ఆహార పదార్థాలు వండడంలో నాణ్యతను పాటించడం లేదు. తక్కువ ధర నూనెలు, మసాలాలు, పాడైన సాస్​లను వంటలలో వాడుతున్నారు. కస్టమర్లకు వడ్డిస్తున్న పాల పదార్థాలు, చికెన్, మటన్ పాడైనవి వాడుతున్నారు. పట్టణంలోని హోటళ్లకు కుటుంబ సభ్యులతో వెళ్లాలంటే భయమేస్తుంది. సంబంధిత అధికారులు హోటల్ యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకోవాలి. కల్తీ ఆహారం తినడం వల్ల ఈ ప్రాంతంలోని ప్రజలు రోగాల పాలవుతున్నారు. 

Tags:    

Similar News