సౌతాఫ్రికాలో సందడి చేస్తున్న ‘బాల వాచకం’.. కరీంనగర్ జిల్లా వాసికి అరుదైన గౌరవం

తెలుగు భాషా మాధుర్యం అంతా ఇంతా కాదు. ఉగ్గుపాల నుంచి ఒక బిడ్డకి తల్లి పాట పాడేందుకు వీలైన భాష.

Update: 2024-08-28 03:06 GMT

దిశ,వెబ్‌డెస్క్: తెలుగు భాషా మాధుర్యం అంతా ఇంతా కాదు. ఉగ్గుపాల నుంచి ఒక బిడ్డకి తల్లి పాట పాడేందుకు వీలైన భాష. అయితే ఖండాంతరాల్లోనూ తెలుగు భాష వెలుగులు విరాజిల్లుతోంది. దక్షిణాఫ్రికాలోని ఓ పాఠశాలలో ’తెలుగు బడి’ బాల వాచకాన్ని అక్కడి తెలుగు విద్యార్థుల కోసం పాఠ్యాంశం గా ఎంపిక చేశారు. కరీంనగర్‌కు చెందిన తెలుగు భాషోద్యమకారుడు, రచయిత కూకట్ల తిరుపతి రాసిన ‘‘తెలుగు బడి(బాల వాచకం)’’ దక్షిణాఫ్రికాలోని ప్రవాస తెలుగు భారతీయ విద్యార్థుల కోసం పాఠ్య పుస్తకంగా ఎంపిక చేసి గత సంవత్సరం నుంచి వినియోగిస్తున్నారు. దక్షిణాఫ్రికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో ఈ పుస్తకం పాఠ్య పుస్తకంగా ఉంది. శాస్త్రీయ విధానం, సాంకేతికతను జోడించి పుస్తకాన్ని రూపకల్పన చేశారు.

విద్యార్థులు తక్కువ రోజుల్లోనే సులువుగా తెలుగును చదవడం, రాయడం నేర్చుకునే విధంగా పాఠాలున్నాయి. ఇందులో సరళ, గుణింత, ద్విత్వాక్షర, సంయుక్తాక్షర, సంశ్లేషాక్షర పదాలు పొందుపరిచి తెలిసిన విషయం నుంచి తెలియని విషయం వైపుగా బోధన జరిగేట్లు ప్రణాళికాబద్ధంగా వివరించారు. పుస్తకంలోని పాఠాల వద్ద క్యూఆర్‌ కోడ్‌ ఇవ్వడంతో విద్యార్థులకు ఇంటర్‌నెట్‌ ద్వారా ఈ పుస్తకంలోని పాఠాలు అందుబాటులో ఉంటాయి. జాతీయాలు, పొడుపు కథలు, సామెతల వివరాలను పొందుపరిచారు. ఇది తెలుగు సంస్కృతిని చాటేలా ఉండటంతో దక్షిణాఫ్రికా తెలుగువారు దీనిని తమ పిల్లలకు బోధించేందుకు పాఠ్యాంశంగా ఎంపిక చేసుకున్నారు.


Similar News