గులాబీకి భూదందా మకిలీ.. ఎన్నికల్లో కబ్జాకోరులకు చెక్!

రాష్ట్రంలో మొదటి ఐదేండ్ల కంటే రెండో దఫా ఎమ్మెల్యేల భూదందా పీక్ స్థాయికి చేరింది.

Update: 2023-12-05 02:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మొదటి ఐదేండ్ల కంటే రెండో దఫా ఎమ్మెల్యేల భూదందా పీక్ స్థాయికి చేరింది. చాలా మంది ప్రజాప్రతినిధులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మునిగితేలారు. ప్రత్యక్ష్యంగానో, పరోక్షంగానో భాగస్వాములయ్యారు. సీన్‌లోకి ఏ కంపెనీ వచ్చినా దాని వెనుక ఎవరో ఒక ఎమ్మెల్యే, మంత్రి పేరు వినబడింది. సదరు కంపెనీ డైరెక్టర్ల జాబితాలో వారి అనూయుల పేర్లు దర్శనమిచ్చాయి. వేలాది ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు ప్రచారం.

వీటిలో సింహభాగం బీఆర్ఎస్ నేతలదే. మండల, జిల్లా స్థాయి నాయకులు సైతం తామేం తక్కువా అన్నట్లుగా భూదందాలో నిమగ్నమయ్యారు. ఇదే గులాబీ పార్టీకి మాయని మచ్చగా మారింది. అందుకే ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రధానాస్త్రంగా మారింది. భూముల ధరలు అమాంతంగా పెంచిన దరిమిలా ఆక్రమణలపై జనం చర్చ తారాస్థాయిలో నడిచింది. కబ్జాలకు పాల్పడ్డారని, ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి.

పేదలు ప్లాట్లుగా కొనుగోలు చేస్తే.. రెవెన్యూ రికార్డులను ఏమార్చి వ్యవసాయ భూములుగా కొనుగోలు చేసిన సంపన్న నేతలను కూడా ఓటర్లు వదిలిపెట్టలేదు. కొందరు బాధితులు వారికి ఓట్లు వేయొద్దంటూ ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. మాకు అన్యాయం చేశాడంటూ సదరు అభ్యర్ధులకు వ్యతిరేకంగా విస్తృతంగా పర్యటించడం గమనార్హం. సీలింగ్, అసైన్డ్, వక్ఫ్ భూములను కొనుగోలు చేసిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. కలెక్టర్ల సహకారంతో వాటి క్లాసిఫికేషన్‌ని పట్టా భూములుగా మార్చుకున్నారు.

ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో వందలాది ఎకరాలను బినామీ పేర్లతో కొల్లగొట్టారన్న ప్రచారం జోరుగా సాగింది. ఐతే ఇక్కడి భూములపై మిగతా జిల్లాలకు చెందిన నేతల దందాలు అధికం. ఆదిలాబాద్​కు చెందిన ప్రజాప్రతినిధి బంధుగణం కోకాపేటలో, మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఫ్యామిలీకి పటాన్ చెరులో, వరంగల్ జిల్లాకు చెందిన వారివి మొయినాబాద్, మాదాపూర్ లో, కరీంనగర్ ప్రజాప్రతినిధుల దందా కూకట్ పల్లి, బాచుపల్లిలో.. అనేకం దర్శనమిస్తున్నాయి.

పుప్పాలగూడ, మణికొండ, గండిపేట వివాదాస్పద భూముల్లో సెటిల్మెంట్లకు మహబూబ్​నగర్, నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వచ్చినట్లు ప్రచారంలో ఉన్నది. 2014 నుంచి 2023 నాటికి పెరిగిన వారి ఆస్తులు, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వందల శాతం పెరిగాయి. సరిగ్గా ఇదే అండర్ గ్రౌండ్ లో ప్రతిపక్షాల ప్రచారం సక్సెస్ అయ్యింది. పెరిగిన సంపాదనకు సమాంతరంగానే ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి కూడా వెనుకడుగు వేయలేదు. కానీ అక్రమాల పునాదులను కూల్చేశారని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. భూదందా ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రులు అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి వంటి వారు ఓటమి పాలయ్యారు.

ఐఏఎస్‌ల సహకారంతోనే..

బడా లీడర్ల ఎస్టేట్ల పక్కన సామాన్యుల భూములు మాయమయ్యాయి. నడిచే దారి లేకుండా చేశారు. సరిహద్దు వివాదాలు సృష్టించారు. అవసరమైతే కోర్టుల్లో కేసులు వేసి మానసికంగా చంపేసి వారి దారికి తెచ్చుకోవడం.. ఆ తర్వాత వారి భూములను అగ్గువ ధరకే కొనుగోలు చేసిన ఉదంతాలు శంషాబాద్ ప్రాంతంలో అనేకం ఉన్నాయి. హైదరాబాద్​నగర శివార్లలోని ఏ బడాబాబు ఎస్టేట్​పక్కనున్న పొలాలను దున్నుకునే రైతును అడిగినా ఇదే సమాధానం.

ఇదే అస్త్రంగా పారిశ్రామికవేత్తలు, రియల్టర్ల పేరిట తెర వెనుక రాజకీయ నాయకులు అమలు చేశారు. ఏ భూములనైతే కొనుగోలు చేయాలనుకుంటారో అకారణంగా.. ఎలాంటి ఆధారాలు లేకుండా.. ఏ కేసుల్లేకుండానే పీఓబీ జాబితాలో నమోదు చేయిస్తున్నారు. తన సమస్యను ఎవరి దగ్గరైనా చెప్పుకుంటే అమ్మేయాల్సిన అవసరాన్ని సృష్టించారు. ఎకరం రూ.50 లక్షలు పలికే చోట సగానికైనా సరే ఇచ్చేయడమే ఉత్తమంగా మధ్యవర్తులు భయాన్ని కల్పించారు.

కొన్ని ఊర్లల్లో పట్టా భూములపై అక్రమ నిషేదాజ్ఞలు కొనసాగాయి. రంగారెడ్డి జిల్లా కేశంపేట, గండిపేట, శంషాబాద్​, కొత్తూరు, నందిగామ, కందుకూరు, ఇబ్రహింపట్నం, మహశ్వరం తదితర మండలాల్లో సామాన్య రైతులు తమ భూములను అన్యాయంగా పీఓబీ జాబితాలో పెట్టారంటూ గగ్గోలు పెట్టారు. ఇప్పుడా భూములపై గులాబీ నీడ కనిపిస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా ఐఏఎస్ అధికారుల సహకారంతోనే నడిచింది.

భూదందాతో ఎన్నికల ఉరి

కొందరు ఎమ్మెల్యేలు వందలాది ఎకరాలు కొనుగోలు చేశారు. కళ్లు చెదిరే ఫామ్ హౌజ్ లను నిర్మించుకున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెద్ద ఎత్తున వాటాలు ఉన్నాయంటూ ఎన్నికల్లో జోరుగా ప్రచారం సాగింది. ఈ ఆస్తుల జాబితా సామాన్య ఓటర్లను ఆలోచింపజేసింది. ఓటు అనే ఆయుధంతో వారి నిర్ణయాన్ని వెల్లడించారు. ఐతే సదరు అక్రమాలకు సహకరించిన తహశీల్దార్లు, కలెక్టర్ల మెడకు కూడా చుట్టుకోనున్నది.


Similar News