న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తా: మంత్రి ఉత్తమ్

రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ, దాని సంస్థలకు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందస్తుందని నీటి

Update: 2024-07-06 17:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ, దాని సంస్థలకు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందస్తుందని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం ఆయన నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ వార్షిక అవార్డులు, ఉపన్యాస కార్యక్రమంలో ప్రసంగించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నల్సార్ యూనివర్సిటీలో స్థానిక విద్యార్థులకు 20 శాతం రిజర్వేషన్‌‌ను కల్పించామన్నారు. స్థానిక విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండేలా చూడాలని వైస్‌ ఛాన్సలర్‌ను కోరారు. నల్సార్‌ విశ్వవిద్యాలయం దేశంలోనే అగ్రశ్రేణి న్యాయ పాఠశాలగా ఎదుగుతోందని కొనియాడారు.

యూనివర్శిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. న్యాయ వ్యవస్థ పట్ల తెలంగాణ ప్రభుత్వానికి అత్యున్నత గౌరవం ఉన్నదన్నారు. హైదరాబాద్‌‌లోని రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల స్థలంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన హైకోర్టు సముదాయం త్వరలోనే రాబోతోందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన న్యాయ వ్యవస్థకు మద్దతుగా తెలంగాణ అంతటా అన్ని స్థాయిలలో అద్భుతమైన కోర్టు, సౌకర్యాలను నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్.వెంకట రమణి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, నల్సార్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు తదితరులు పాల్గొన్నారు.


Similar News