‘మీ తాతలు సంపాదించిన ఆస్తి కాదు..’ బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి

గత ప్రభుత్వం దోపిడీ చేసిన దాంట్లో 10 శాతం ఖర్చు పెట్టినా మూసీ నిర్వాసితులందరి జీవితాలు బాగుపడతాయని, సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2024-10-05 09:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌పై కూడా రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వం దోపిడీ చేసిన దాంట్లో 10 శాతం ఖర్చు పెట్టినా మూసీ నిర్వాసితులందరి జీవితాలు బాగుపడతాయని, బీఆర్ఎస్ బ్యాంకుల్లో రూ.1500 కోట్లున్నాయని, అందులో చేతనైతే రూ.500 కోట్లు ఇవ్వాలని.. ఆ డబ్బున్ని పేదలకు పంచి పెడదామని సవాల్ విసిరారు. గజ్వేల్‌లో 1000 ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఉందని, అందులో 500 ఎకరాలిస్తే అందులో అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని, భూదానం కేసీఆర్ చేస్తే ఇళ్లు కట్టించే బాధ్యత తనదని, లేకపోతే కేటీఆర్ అయినా తనకు జన్‌వాడలో ఉన్న 50 ఎకరాల్లో 25 ఎకరాలిచ్చినా.. 10 అంతస్థుల్లో బాధితులందరికీ ప్రభుత్వ సొమ్ముతో ఇల్లు కట్టిస్తానని అన్నారు. ఇదంతా వాళ్ల తాతలు సంపాదించిన ఆస్తులు కాదని, దోచుకుంటే వచ్చినవేనని.. 2004లో కేసీఆర్ ఎలక్షన్ అఫిడవిట్, 2005 హరీశ్ రావు ఎలక్షన్ అఫిడవిట్.. 2009లో కేటీఆర్ ఎలక్షన్ అఫిడవిట్ చూస్తే ఆ విషయం స్పష్టం అవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జీ వెంకటస్వామి జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్‌కి టీవీలు, పేపర్లు, పార్టీ ఆఫీసులు, ఫాం హౌస్‌లు ఎలా వచ్చాయో, లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో మీరు ఎంత అక్రమంగా సంపాదించారో ఈ అఫిడవిట్లు చూస్తే తెలిసిపోతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే, ప్రజలు ఆస్తులు కోల్పోతుంటే వాళ్ల కుటుంబం ఆస్తులు మాత్రం గుట్టలుగుట్టలుగా పెరిగిపోయాయని విమర్శలు చేశారు. మీరైతే వెయ్యి ఎకరాల్లో పాం హౌస్‌లలో రాజుల్లా బతుకుతారు.. కానీ తెలంగాణ పేదలు మూసీ మురికిలో దుర్భర జీవితం అనుభవించాలా.?? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Similar News