కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారు.. పొందడానికి అర్హతలు ఇవే!

ఫుడ్ సెక్యూరిటీ కార్డుల కోసం ఏడేండ్లుగా నిరీక్షిస్తున్న దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించనున్నది. వచ్చేనెలలో కొత్త కార్డులను అందించడానికి సివిల్ సప్లయిస్ డిపార్టుమెంటు సన్నాహాలు మొదలుపెట్టింది.

Update: 2023-12-27 02:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఫుడ్ సెక్యూరిటీ కార్డుల కోసం ఏడేండ్లుగా నిరీక్షిస్తున్న దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించనున్నది. వచ్చేనెలలో కొత్త కార్డులను అందించడానికి సివిల్ సప్లయిస్ డిపార్టుమెంటు సన్నాహాలు మొదలుపెట్టింది. గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించనుంది. తొలుత స్క్రూటినీ చేసి ఆ తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ చేపట్టి అర్హులైనవారికి జనవరిలోనే కొత్త కార్డులను ఇవ్వాలని భావిస్తున్నది. ఇందుకోసం అనుసరించాల్సిన విధానాన్ని, అర్హతలను, పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలతో గైడ్‌లైన్స్ రూపొందించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 24న సచివాలయంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో చర్చించడానికి సివిల్ సప్లయిస్ డిపార్టుమెంటు ఐదు పేజీల డాక్యుమెంటును తయారుచేసింది.

కలెక్టర్ మొదలు తాసీల్దార్ వరకు పటిష్టమైన మెకానిజం

కొత్త రేషన్ కార్డులు పొందడానికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆ డాక్యుమెంట్‌లో పేర్కొన్నది. ప్రజాపాలనలో భాగంగా గ్రామాల్లో జరిగే గ్రామసభల్లో దరఖాస్తులు ఇవ్వాల్సిందిగా చాటింపు వేయించాలని తెలిపింది. డిప్యూటీ తాసీల్దారు లేదా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ లేదా చెకింగ్ ఇన్‌స్పెక్టర్ గ్రామాల్లో తిరిగి ప్రజలకు దరఖాస్తుల గురించి వివరించాలని పేర్కొన్నది. నిర్దిష్ట ఫార్మాట్‌లో భర్తీ చేసిన దరఖాస్తులను పరిశీలించడానికి, ఫిజికల్ వెరిఫికేషన్ చేయించడానికి కలెక్టర్ మొదలు తాసీల్దారు వరకు పటిష్టమైన మెకానిజానికి సంబంధించిన అంశాలను అందులో పేర్కొన్నది. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఇంటికి వెళ్లి వెరిఫికేషన్ చేసే ఇన్‌చార్జి అధికారి.. దరఖాస్తుదారుడి అర్హతలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించాలని స్పష్టం చేసింది.

ఫుడ్ సేఫ్టీ కార్డు ఇవ్వకూడదని వెరిఫికేషన్ ఆఫీసర్ భావిస్తే అందుకు సంబంధించి ‘ఇన్ ఎలిజిబుల్’, ‘బోగస్’, ‘అదర్స్’ (వివరణతో) అని పేర్కొనాల్సి ఉంటుందని స్పష్టతనిచ్చింది. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులన్నింటినీ సేకరించి వాటికి నెంబరింగ్ ఇవ్వాలని, రిజిస్టర్‌లో నమోదు చేయాలని, వాటన్నింటినీ సంబంధిత తాసీల్దార్లు లేదా అసిస్టెంట్ సివిల్ సప్లయిస్ ఆఫీసర్‌కు అందజేయాలని పేర్కొన్నది. మండల స్థాయిలో తాసీల్దారు నోడల్ అధికారిగా వ్యవహరించాలి. ఈ మొత్తం ప్రాసెస్‌ను జిల్లా కలెక్టర్ పర్యవేక్షించాలి. రేషన్ కార్డుల మంజూరులో ఎక్కడ తేడా వచ్చినా వెరిఫికేషన్ అధికారిదే బాధ్యత అని, పూర్తిగా వారే జవాబుదారీగా ఉంటారని, ఇంటిని విజిట్ చేసినట్టుగా సర్టిఫికెట్‌లో తేదీ, సమయంతో పాటు సేకరించిన వివరాలను పొందుపర్చాలని సివిల్ సప్లయిస్ ఆ డాక్యుమెంట్‌లో స్పష్టం చేసింది.

వెరిఫికేషన్ ఇలా

ప్రజల నుంచి దరఖాస్తులు అందిన తర్వాత మొదటి దశలో వాటిని అందులో పేర్కొన్న భూముల వివరాలతో అధికారులు పోల్చి చూస్తారు. ఇందుకోసం భూమాత పోర్టల్‌ను అధికారికంగా పరిగణనలోకి తీసుకుంటారు. ఎన్ఐసీ పోర్టల్‌లో ఉన్న వివరాలను నిర్దిష్టంగా ఆ గ్రామానికి సంబంధించినవి డౌన్‌లోడ్ చేసి వెరిఫికేషన్ ఇన్‌చార్జికి తాసీల్దార్ లేదా అసిస్టెంట్ సివిల్ సప్లయిస్ అధికారి అప్పగిస్తారు. వాటి ఆధారంగా వెరిఫికేషన్ ఇన్‌చార్జి ఫిజికల్ ఎంక్వయిరీకి వెళ్తారు.

వెరిఫికేషన్ సమయంలో పరిశీలించే అంశాలు (కొన్ని)

- ఇంటి స్వభావం (గుడిసె, రేకుల పైకప్పు, ప్లాస్టిక్ రూఫ్, పెంకుటిల్లు, సిమెంట్ కాంక్రీట్ శ్లాబ్)

- ఇంట్లో ఉంటున్నవారి సంఖ్య, వివరాలు (ప్రతి ఒక్కరివీ)

- కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డుల నెంబర్లు (అవసరమైతే ఆధార్ డాక్యుమెంట్‌ను పరిశీలించాలి)

- కుటుంబ సభ్యులందరి ఉపాధి వివరాలు (రోజువారీ కూలీ, కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్, ప్రభుత్వ ఉద్యోగి, ప్రైవేటు ఉద్యోగి, స్వయం ఉపాధి)

- భూమి వివరాలు (స్వాధీనంలో ఉన్నదా? అనుభవంలో ఉన్నదా?)

- ఫోర్ వీలర్స్ సొంతంగా ఉన్నాయా? (కమర్షియల్/జేసీబీ)

- కుటుంబ సభ్యుల్లో అంగవైకల్యం ఉన్నవారి వివరాలు

- ఆదివాసీలు, గిరిజనులు ఉంటే వారి వివరాలు

- ఆదాయపు పన్ను మదింపుదారులు (టాక్స్ అసెస్సీ)

రేషన్ కార్డు పొందడానికి అర్హతలు

రేషను కార్డు పొందడానికి ఉండాల్సిన అర్హతలపైనా సివిల్ సప్లయిస్ డిపార్టుమెంటు కలెక్టర్ల కాన్ఫరెన్సు సందర్భంగా ప్రతిపాదించిన డాక్యుమెంటులో నిర్దిష్టంగా కొన్ని ప్రామాణికాలను పేర్కొన్నది. పేదలకు పౌర సరఫరాల విభాగం ద్వారా లభించే సౌకర్యాలను అందించే ఉద్దేశంతో కార్డులు ఇస్తున్నందున అవి దుర్వినియోగం కాకుండా, నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా ఉండాలని కొన్ని నిబంధనలు రూపొందించిట్టు స్పష్టం చేసింది.

పరిమితులు (కొన్ని)

- కుటుంబ సభ్యులందరి గరిష్ట వార్షికాదాయం గ్రామాల్లో రూ.లక్ష , పట్టణాల్లో రూ.2 లక్షలు దాటొద్దు

- ఒకవేళ కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతం ఏడాదికి పై లిమిట్ దాటొద్దు

- కుటుంబం మొత్తానికి మూడున్నర ఎకరాలకు మించి మాగాణి (వెట్ లాండ్), ఏడున్నర ఎకరాలకు మించి మెట్ట (డ్రై లాంట్) సాగుభూమి ఉండకూడదు

- భూమి విస్తీర్ణం మాత్రమే క్రైటీరియా కాకుండా దానిమీద వస్తున్న ఆదాయం పైన పేర్కొన్న వార్షికాదాయం సీలింగ్‌కు మించొద్దు

- ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థ ఉద్యోగులు రేషన్ కార్డుకు అనర్హులు. ప్రైవేటు సెక్టార్ ఉద్యోగులు వార్షికాదాయం సీలింగ్ మించొద్దు

- డాక్టర్లు, కాంట్రాక్టర్లు, ప్రొఫెషనల్స్, సొంతంగా బిజినెస్ చేసుకనే వారు అనర్హులు.

- భారీస్థాయి వ్యాపారాలు (ఆయిల్ మిల్స్, రైస్ మిల్స్, పెట్రోలు బంకులు, రిగ్ ఓనర్లు, షాప్ ఓనర్లు..) ఉండొద్దు

- ప్రభుత్వ పింఛనుదార్లుగా (రిటైర్ట్ ఉద్యోగులు), స్వాతంత్ర్య సమరయోధులుగా ఉన్నవారు అనర్హులు

- ఫోర్ వీలర్స్, కమర్షియల్ వెహికల్స్, జేసీబీ లాంటి వాహనాలు ఉండొద్దు

- వెరిఫికేషన్ సమయంలో కుటుంబ సభ్యుల జీవన ప్రమాణాలు, లైఫ్ స్లయిల్, ఆస్తిపాస్తులు తదితరాలను పరిగణనలోకి తీసుకుని రేషను కార్డు పొందడానికి ‘పేదలు’ అనే అర్హతలు లేకపోయినా కార్డు రాదు.

ఒకే ఇంట్లో వేరువేరు కుటుంబాలు ఉంటే..

ఫిజికల్ వెరిఫికేషన్ సమయంలో దరఖాస్తు చేసుకున్నవారి వివరాల ప్రకారం గతంలో ఒకే కుటుంబంలో సభ్యులుగా పాత రేషన్ కార్డులో పేర్లు నమోదై ఉన్నా ఇప్పుడు అదే చిరునామా కలిగిన నివాసంలో వేరే కుటుంబంగా ఉంటున్నట్టు వెరిఫికేషన్ ఇన్‌చార్జి సంతృప్తి చెందినట్లయితే కొత్త కార్డు తీసుకోడానికి అర్హత ఉంటుందని డాక్యుమెంటులో సివిల్ సప్లయిస్ డిపార్టుమెంటు అభిప్రాయపడింది. గతంలో పాత కార్డుల్లో పేర్లు లేకుండా ఇప్పుడు మాత్రమే కొత్త కార్డు తీసుకోడానికి దరఖాస్తు చేసుకుని ఉన్నట్లయితే మంజూరు చేయవచ్చని పేర్కొన్నది. ఆధార్ కార్డు‌ను ప్రామాణికంగా తీసుకుని ఇప్పుడు కొత్త కార్డులు పొందాలనుకుంటున్నవారు గతంలో పాత కార్డుల్లో రాష్ట్రంలో ఎక్కడా లేరని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుందని నొక్కిచెప్పింది.

అర్హులకు అందాలనే ఉద్దేశంతో..

అర్హులకు తప్పనిసరిగా కొత్త రేషన్ కార్డులు అందించాలనే ఉద్దేశంతో సివిల్ సప్లయిస్ డిపార్టుమెంటు నిర్దిష్టమైన గైడ్‌లైన్స్ రూపొందించడంతో పాటు అర్హత లేకపోయినా అనుభవిస్తున్నవారి కారణంగా పేదలకు అవకాశాలు చేజారకూడదని స్పష్టం చేసింది. కొత్త రేషన్ కార్డులు కేవలం పౌర సరఫరాల శాఖ ద్వారా బియ్యం అందుకునే ఉద్దేశంతోనే మంజూరు చేయాలని భావిస్తున్నందున ప్రభుత్వం నుంచి ఇతర సంక్షేమ పథకాలకు ఈ కార్డులు ప్రామాణికం కాదని క్లారిటీ ఇచ్చింది. గతంలో దరఖాస్తు చేసి వెరిఫికేషన్ పూర్తయిన వాటిని సైతం తిరిగి ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని ప్రస్తుత నిబంధనలకు లోబడి ఉన్నవారికి కార్డులు మంజూరు అవుతాయని పేర్కొన్నది.

రాష్ట్రంలో మొత్తం రేషన్ దుకాణాలు : 18,458

కార్డుల కోసం వచ్చిన మొత్తం దరఖాస్తులు : 1,08,45,196

వాటి ప్రకారం కుటుంబ సభ్యుల సంఖ్య : 3,88,36,504

మంజూరుతో లబ్ది పొందుతున్నవారు : 2,80,06,107

తాత్కాలికంగా అప్రూవ్ అయినవి : 1,93,385 (వ్యక్తులు)

తిరస్కరణకు గురైనవి : 1,06,37,103 (వ్యక్తులు)

మొత్తం అప్రూవ్ అయ్యి వినియోగంలో ఉన్న కార్డుల సంఖ్య : 89,98,458

రిజెక్టు అయిన కార్డుల సంఖ్య : 17,23,069

మైగ్రేషన్‌లో ఉన్న కార్డుల సంఖ్య : 1,40,232

మొత్తం కార్డుల్లో ఎల్‌పీజీ కనెక్షన్లు ఉన్నవి : 63,12,773

Tags:    

Similar News