బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్.. తీవ్ర స్థాయికి చేరిన వర్గపోరు!
ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు తీవ్రంగా సాగుతోంది. ఆధిపత్య పోరుతో కేడర్‌లో అయోమయం నెలకొంది.
దిశ, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు తీవ్రంగా సాగుతోంది. ఆధిపత్య పోరుతో కేడర్‌లో అయోమయం నెలకొంది. ప్రధానంగా ఫ్లెక్సీలే కేంద్రంగా సాగుతున్న కట్టడి చర్యలపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాలోని రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో మహా శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల చుట్టే రాజకీయాలు చోటు చేసుకోవడం విచిత్రం.
పెద్దపల్లిలో...
పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీలో స్థానిక బీర్ఎస్ నాయకుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరక్టర్ ఇజ్జగిరి రాజు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించారు. దాని స్థానంలో మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీను కావాలనే తొలగించే మరో నేత తన ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకున్నాడని ఆరోపిస్తూ ఈ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అంతేకాకుండా తాను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బీఆర్ఎస్ నాయకుల ఫోటోలు ఉన్నాయని, మరో నేత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్య నేతల ఫోటోలు కూడా లేవంటూ ఆరోపణలు గుప్పించాడు.
రాజన్న జిల్లాలో
మహా శివరాత్రి పర్వదినాన వేములవాడ రాజన్న సన్నిధిలోనూ బీఆర్ఎస్ నాయకుల ఫ్లెక్సీలు తొలగించే ప్రక్రియ కొనసాగింది. చల్మెడ లక్ష్మీనరసింహరావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను స్థానిక మునిసిపల్ సిబ్బంది తొలగించారు. వేములవాడ పట్టణంలో ఇతర నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించకుండా కేవలం చల్మెడ లక్ష్మీనరసింహరావుకు సంబంధించిన ఫ్లెక్సీలే తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
జగిత్యాలలో...
జగిత్యాల పట్టణంలో కూడా మహాశివరాత్రి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తాజా మాజీ మునిసిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి ఫోటో లేకుండా ప్లెక్సీ ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. పట్టణానికి చెందిన నాయకులందరి ఫోటోలు ఉన్నప్పటికీ శ్రావణి ఫొటో లేకపోవడంపై నెట్టింట వైరల్ అయింది. శివరాత్రి నాడు ఉదయం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కూడా ఇందుకు కౌంటర్ అన్నట్టుగా మీడియా గ్రూపుల్లో ఫోటో, వీడియో షేర్ చేశారు. బోగ శ్రావణి మామ వెంకటేశ్వర్లు బండి సంజయ్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్రలో కలిసినట్టుగా కామెంట్ చేశారు. అలాగే బీజేపీ కౌన్సిలర్ ఆరోపణలకు సంబంధించిన వీడియోను, పత్రికా ప్రకటన కాపీని విడుదల చేశారు. ఏది ఏమైనా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం అధికారపార్టీ నాయకుల మధ్య ఫ్లెక్సీ వార్ ఓపెన్‌గా సాగుతున్నట్టుగా స్పష్టం అవుతోంది.
Also Read..