ఆరు గ్యారంటీల అమలు.. CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-12-09 09:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆరు గ్యారెంటీల్లోని మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చేయూత పథకంలో భాగంగా ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే పథకాలను అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించారు. అలాగే తెలంగాణ తరపున బాక్సర్ నిఖత్ జరీన్ కు రూ.2 కోట్లు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9 తెలంగాణకు పండగ రోజని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారన్నారు. తెలంగాణ ప్రజల కోసం సోనియమ్మ ఆరు గ్యారెంటీలను ప్రకటించారని ఇచ్చిన మాట ప్రకారం వాటిలో రెండు పథకాలను ఇవాళ ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు.

మహిళలు ఈరోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ఉచితకంగా ప్రయాణించవచ్చన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. ఈ కార్యకర్రమంలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీఎస్ శాంతికుమారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించాక అసెంబ్లీ నుంచి మహిళా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులతో పాటు సీఎం, డిప్యూటీ సీఎం తదితరులు ట్యాంక్ బండ్‌కు బస్సులో బయలుదేరారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించి అనంతరం అదే బస్సులో అసెంబ్లీ ప్రాణంగానికి చేరుకున్నారు.


Similar News