వానపడితే తీవ్ర నష్టమే! ఆందోళనలో రైతన్నలు
రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు రైతులను నట్టేట్లో ముంచేలాగా ఉన్నాయి.
దిశ, వెల్గటూర్ : రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు రైతులను నట్టేట్లో ముంచేలాగా ఉన్నాయి. ఆకాశంలో కమ్ముకుంటున్న కారు మబ్బులు కలవర పెడుతుండగా అక్కడక్కడ కురుస్తున్న వడగళ్ల వర్షాలు రైతులను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి సాగుచేసిన వరి, మామిడి, మొక్కజొన్న ఇతరత్రా పంటలు కొద్దిరోజుల్లో చేతికి అంది వచ్చే దశలో ఉండగా అకాల వర్షాలతో నోటికి అందకుండా పోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెడగొట్టు వానలుగా పిలుచుకునే ఈ వర్షాలు అన్ని పంటలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి.
వెల్గటూరు మండలంలో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలను రైతులు సాగు చేస్తున్నారు. పత్తి పంట కాలం ఇప్పటికే పూర్తవగా ప్రస్తుతం 18 వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు వరి పంటలను సాగు చేశారు. మొక్కజొన్న, పెసర, మినుము, మామిడి పంటలు సుమారుగా 500 ఎకరాల్లో సాగుచేశారు. ఇప్పుడు పడే వానలతో ప్రధానంగా వరి, మామిడి పంటలకు అధిక నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైతే మండలంలో అకాల వర్షాలు పడకపోగా ఆకాశంలో మబ్బులు కమ్ముకొని ఉండటం రైతులను తీవ్రంగా భయపెడుతున్నాయి.
పూత దశలో పడితే నష్టమే...
పొట్ట పూత దశలో ఉన్న వరి పొలాలకు అకాల వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ దశలో వర్షం పడితే గొలకల్లో పూత రాలిపోయి సంపర్కం జరగక దిగుబడి తగ్గుతుంది. అదేవిధంగా పొట్ట దశలో ఉన్న పొలాలు తెగుళ్ల బారిన పడి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. అకాల వర్షాలు, వడగళ్లు, గాలి దుమారాలతో మామిడి పంటలకు సైతం తీవ్ర నష్టం జరుగుతుంది.
దిగుబడి తగ్గి... పెట్టుబడి పెరిగి..
ఈ వర్షాల మూలంగా అన్ని పంటల్లో దిగుబడి తగ్గి పెట్టుబడి ఖర్చులు పెరుగుతాయి. వరి పంట పూత దశలో ఉండంగా వర్షం పడితే పూత రాలిపోవడంతో పాటు గింజలు పాలు పట్టకుండా అవిసిపోయి దిగుబడి తగ్గుతుంది. ఈ వాతావరణం వల్ల పంటలకు తెగుళ్లు వస్తాయి. పురుగు మందుల కోసం పెట్టుబడి మరింత పెరిగే అవకాశం ఉంది.