యూ ఆర్ అండర్ అరెస్ట్...డిజిటల్ అరెస్టు అంటూ 1.58 కోట్లు బదిలీ

డిజిటల్ అరెస్టు భయాన్ని చూపించి రూ. 1.58 కోట్లు కొట్టేసిన సంఘటనలో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు 70.01 లక్షలు రికవరీ చేసి బాధితురాలికి ఆర్థిక ఊరటను కల్పించారు.

Update: 2025-01-02 14:16 GMT

దిశ, సిటీక్రైం : డిజిటల్ అరెస్టు భయాన్ని చూపించి రూ. 1.58 కోట్లు కొట్టేసిన సంఘటనలో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు 70.01 లక్షలు రికవరీ చేసి బాధితురాలికి ఆర్థిక ఊరటను కల్పించారు. మిగతా డబ్బులు రికవరీ తో పాటు నిందితులను అరెస్ట్ చేయడానికి పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. రాచకొండ సైబర్ క్రైం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...ఉప్పల్ ప్రాంతానికి చెందిన గీత ఉపాధ్యాయ(65) కు వాట్సాప్ లో వీడియో కాల్ వచ్చింది. అతను ముంబాయికి చెందిన సైబర్ క్రైం పోలీసు అధికారి అంటూ పరిచయం చేసుకుని ఆమెను ఆందోళనకు గురి చేశాడు. మీ ఆధార్ కార్డుతో ఒక ఫోన్ నెంబరుకు సంబంధించిన సిమ్ కార్డు జారీ అయ్యిందని, ఆ సిమ్ కార్డుతో అసభ్యకరమైన మెసేజ్ లు పంపిస్తున్నారంటూ కలవరం రేపి దేశవ్యాప్తంగా మీ ఫోన్ నెంబరు పై 25 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని ఆందోళన కలిగించాడు. ఈ నేపథ్యంలో మిమ్మల్ని అరెస్టు చేయాలని భయపెట్టించాడు.

మీరు ఈ కేసు నుంచి బయట పడాలంటే మేము చెప్పినట్లు చేయాలని, ఎవరికి ఈ విషయం చెప్పొద్దని మభ్యపెట్టించి గీత ఉపాధ్యాయ కు చెంది ఎఫ్ డిలు, పీపీఎఫ్ లను రద్దు చేయించి మొత్తం 1.58 కోట్ల ను మూడు బ్యాంక్ ఖాతాల్లో కి బదిలీ చేయించుకున్నాడు. చివరకు ఇది మోసమని గ్రహించి బాధితురాలు గత నెల 24వ తేదీన రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు 70.01 లక్షల రూపాయాలను బదిలీ అయిన ఖాతాల్లో జప్తు చేసి వాటిని కోర్టు ద్వారా తిరిగి బాధితురాలి ఖాతాకు చేర్చారు. ఈ విధంగా వేగంగా స్పందించి బాధితురాలికి పొగొట్టుకున్న సొమ్మును తిరిగి చేర్చిన అధికారులను సీపీ సుధీర్ బాబు అభినందించారు. ప్రజలు ఎవరూ కూడా వాట్సాప్ కాల్స్ లో పోలీస్ డ్రెస్సు వేసుకుని కనిపించినా, మామూళ్లు దుస్తుల్లో కనిపించి తాము పోలీసులమని డిజిటల్ అరెస్టు అంటే అసలు నమ్మొద్దని వారంతా సైబర్ నేరగాళ్ళుగా అనుమానించి వెంటనే 1930 కు కాల్ చేయాలని పోలీసులు కోరుతున్నారు.


Similar News