అయ్యప్ప సొసైటీపై హైడ్రా ఫోకస్..
హైదరాబాద్ మహా నగరంలో పార్క్ స్థలాలు, సర్కార్ భూములు, ఎఫ్టీఎల్ లో నిర్మాణాలను ఇన్నాళ్లు కూల్చివేసిన హైడ్రా.. ఇప్పుడు మాదాపూర్ డివిజన్ లోని అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ చేసింది.
దిశ, శేరిలింగంపల్లి : హైదరాబాద్ మహా నగరంలో పార్క్ స్థలాలు, సర్కార్ భూములు, ఎఫ్టీఎల్ లో నిర్మాణాలను ఇన్నాళ్లు కూల్చివేసిన హైడ్రా.. ఇప్పుడు మాదాపూర్ డివిజన్ లోని అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ చేసింది. తాజాగా అయ్యప్ప సొసైటీలోని పలు అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు హైడ్రా అధికారులు సిద్ధమయ్యారు. గత కొంతకాలంగా అయ్యప్ప సొసైటీలోని పలు నిర్మాణాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శనివారం ఉదయం అయ్యప్ప సొసైటీలో పర్యటించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలు నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. వాటిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఇల్లీగల్ బిల్డింగ్స్, ఆక్రమణలను గుర్తించారు. ప్రస్తుతానికి మూడు నిర్మాణాలను కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా అయ్యప్ప సొసైటీలోని 100 ఫీట్స్ రోడ్డులో పాలమూరు గ్రిల్స్ కు పక్కనే నిర్మించిన ఓ ఇల్లీగల్ భవనాన్ని కూల్చివేతకు గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా ఆ భవనాన్ని డిమాలూషన్స్ చేసేందుకు ఇప్పటికే మూడు డీఆర్ఎఫ్ బృందాలు బిల్డింగ్ దగ్గరకు చేరుకుని కూల్చివేతలకు రంగం సిద్ధం చేశాయి. 100 ఫీట్ల రోడ్డులో ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల కోసం డిఆర్ఎఫ్ సిబ్బంది వేచి చూస్తున్నారు. ఆదివారం ఉదయం సదరు బిల్డింగ్ ను కూల్చి వేయనున్నట్లు హైడ్రా సిబ్బంది తెలిపారు. అయితే ఈ మూడు నిర్మాణాలతో పాటు గురుకుల్ ట్రస్ట్ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా వెలసిన బహుళ అంతస్థుల నిర్మాణాలపై కూడా అధికారులు ఫోకస్ చేయాలని, కొందరు బిల్డర్లు కుమ్మక్కై ఇష్టారీతిగా నిర్మాణాలు చేపట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేయాలన్న డిమాండ్ జనాల నుండి వినిపిస్తోంది. అయితే హైడ్రా ఏ మేరకు చర్యలు తీసుకోనుంది. ఒకటి రెండు నిర్మాణాల కూల్చివేత్తలతో సరిపెడుతుందా లేదా ఇల్లీగల్ నిర్మాణాలను నేలమట్టం చేస్తారా అనేది చూడాలి.