మీరాలం నుండి స్కై వాక్ ఏర్పాటు చేయండి : అసదుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చేపట్టే మెట్రో రైల్వే లైన్

Update: 2025-01-06 14:47 GMT

దిశ,హైదరాబాద్ బ్యూరో : హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చేపట్టే మెట్రో రైల్వే లైన్ నిర్మాణం కోసం పాత బస్తీ లో ఇండ్లు, భూములు కోల్పోయిన వారు వ్యాపారం చేసుకునేందుకు మెట్రో స్టేషన్లలో మొదటి ప్రాధాన్యత కల్పించాలని హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో మెట్రో రైలు నిర్మాణం కోసం ఇండ్లు, స్థలాలు కోల్పోయిన 40 మంది కి రూ 18.63 కోట్ల రూపాయల చెక్కులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మెట్రో ఎండీ ఎన్ విఎస్ రెడ్డి లతో కలిసి హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ అందచేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్రో ప్రాజెక్టు పేజీ 2 కింద 6వ కారిడార్ ను 7.5 కిలోమీటర్ల మెట్రో నిర్మాణ పనులు ఎం జి బి ఎస్ నుండి చంద్రాయణగుట్ట వరకు నాలుగు సంవత్సరాలలో రూ. 2,741 కోట్లతో ప్రభుత్వం చేపట్టనున్నట్లు తెలిపారు. మెట్రో లైన్ , స్టేషన్లను సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, అలియాబాద్,ఫలక్ నుమా లలో చేపట్టడం జరుగుతుందని అన్నారు. స్థలాలు కోల్పోయిన వారికి గజానికి రూ 60 వేలు చెల్లించవలసి ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు గజానికి రూ 81 వేల పెంచి అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.

మెట్రో ఎండీ ఎన్ వి ఎస్ రెడ్డి మాట్లాడుతూ ఓల్డ్ సిటీ లో రూ. 2741 కోట్లతో అత్యంత ఉన్నత ప్రమాణాలతో చేపట్టే మెట్రో లైన్ కారిడార్ 6 ను నాలుగు సంవత్సరాలలో పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. పాత బస్తీ మెట్రో నిర్వాసితులను ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో ఓల్డ్ సిటీ మరింత అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, మెట్రో లైన్ కింద ఇండ్లు, స్థలం కోల్పోయిన వారికి నష్ట పరిహారం వేగవంతంగా అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమం లో మెట్రో భూ సేకరణ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్వర్ణలత, ఆర్డిఓ రామకృష్ణ, జీహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News