Bandi Sanjay: అన్నీ కోతలేనా?.. కేబినెట్ నిర్ణయాలపై బండి సంజయ్ ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’’ పేరుతో రైతులకు ఎకరాకు రూ.12 వేలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం దుర్మార్గం. దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, ఆ తరువాత ప్రజలను దారుణంగా మోసం చెయ్యడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ‘‘కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం’’ పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హమీలకు, నేడు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు పొంతనే లేదు. ప్రతి రైతుకు, కౌలు రైతుకు ఎకరానికి రూ.15 వేలు చొప్పున, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా సొమ్ము చెల్లిస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ నేడు అందుకు భిన్నంగా రూ.12 వేలు మాత్రమే ఇస్తానని ప్రకటించడమంటే రైతులను దగా చేయడమే.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అయినప్పటికీ ఏడాదిపాటు రైతు భరోసా చెల్లించకుండా ఎగ్గొట్టారు. ఆలస్యమైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని, గత ఏడాది చెల్లించాల్సిన బకాయి కూడా చెల్లిస్తారని ఆశించిన రైతులకు పూర్తి నిరాశే ఎదురైంది. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో రైతు భరోసా బకాయి చెల్లించకపోగా, ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన రైతు భరోసా హామీకి సైతం తూట్లు పొడిచి ఇందిరమ్మ అభయ హస్తమంటే... భస్మాసుర హస్తమని నిరూపించారు.
నేడు రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే... కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అదనంగా నయాపైసా కూడా సాయం చేయలేదని తేటతెల్లమైంది. ఎందుకంటే ఎగ్గొట్టిన ఏడాది రైతు భరోసా బకాయి మొత్తాన్ని విభజించి ఏటా రెండేసి వేల రూపాయల చొప్పున రాబోయే నాలుగేళ్లకు జోడించి చెల్లించాలనుకుంటున్నారే తప్ప రైతులకు అదనంగా ఒరగబెట్టిందేమీ లేదు. ఇంకా చెప్పాలంటే గతంతో పోలిస్తే కాంగ్రెస్ పాలనలో ఎకరాకు మరో రూ.2 వేల రూపాయలు రైతులు నష్టపోయినట్లయింది.
కౌలు రైతులకు, భూమిలేని వ్యవసాయ కూలీలకు సైతం రైతు భరోసా ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి వ్యవసాయ కూలీలను పూర్తిగా విస్మరించడం అన్యాయం. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది రైతులకు ఎంత మొత్తాన్ని చెల్లిస్తారు? అట్లాగే ఎంత మంది కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు రైతు భరోసా సొమ్ము చెల్లిస్తారో ప్రకటించకపోవడం విడ్డూరం. సీఎం ప్రకటనను చూస్తుంటే.... ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో రైతు బంధు లబ్దిదారుల సంఖ్యలో భారీగా కోత విధించాలనుకుంటోంది. ఇప్పటికే రుణమాఫీ పేరుతో కోతలు పెట్టారు. అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని, సన్న వడ్లకే బోనస్ ను పరిమితం చేశారు. అది కూడా కొంత మంది రైతులకే బోనస్ చెల్లించారు. 46 లక్షల మంది రైతులకు ‘రుణమాఫీ’ చెల్లిస్తామని 22 లక్షల మందికిపైగా రైతులకు ఎగ్గొట్టారు. రైతు సంక్షేమ ప్రభుత్వమంటే కోతలు విధించడమేనా? ఇందిరమ్మ పాలనంటే ఇచ్చిన మాట తప్పడమేనా?
100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏడాదిపాటు తూట్లు పొడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండో ఏడాదిలోనైనా వాటిని పూర్తిస్తాయిలో అమలు చేయకపోవడం అన్యాయం. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు నెలనెల రూ. 2500 రూపాయలు, తులం బంగారం, స్కూటీ ఇస్తామని తెలంగాణ ఆడబిడ్డలను నిండా ముంచారు. వ్రుద్దులు, వితంతవులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని చెబితే ఏడాదిగా ఎదురుచూస్తున్న అవ్వాతాతల నోట్లో మట్టికొట్టారు. రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తారని ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఎగనామం పెట్టారు. నెలానెలా రూ.4 వేల భ్రుతి ఇస్తారని, 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తారని ఎదురు చూస్తున్న నిరుద్యోగులను నడిరోడ్డున పడేశారు. ఇల్లులేని పేదలందరికీ జాగా తోపాటు రూ. 5 లక్షల చొప్పున ఆర్దిక సాయం చేస్తామని హామీ ఇచ్చి పేదల బతుకులను బజారున పడేశారని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.