BJP: బీసీ కులగణన రిపోర్ట్ బయటపెట్టాలి.. బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన రిపోర్టును బయటపెట్టాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన రిపోర్టును బయటపెట్టాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ బీసీలకు సముచిత స్థానం ఇవ్వడంలేదని విమర్శలు చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. సారా అమ్మి జైలుకి వెళ్ళిన వారికి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని కల్వకుంట్ల కవితపై కాసం పరోక్ష విమర్శలు చేశారు. పాలించడానికి బీసీలు పనికిరారని గతంలో రేవంత్ రెడ్డి స్టేట్ మెంట్ ఇచ్చి బీసీలను అవమానించారని వెంకటేశ్వర్లు ఫైరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా ఇవ్వకపోవడం సిగ్గు చేటని ఆయన ధ్వజమెత్తారు. దీనిపై పోరాటాలు చేస్తామని ఫైరయ్యారు. ఈనెల 10వ తేదీన రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీల అమలుకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆర్డీవోలకు, మండల కేంద్రాల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు అందిస్తామన్నారు.