రాష్ట్ర అవతరణ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా ‘ట్యాంక్ బండ్’.. కళ్లు జిగేల్ అనేలా ముస్తాబు..!

రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ సర్కారు వచ్చే నెల 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్దమవుతుంది.

Update: 2024-05-29 16:49 GMT

దిశ, సిటీ బ్యూరో: రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ సర్కారు వచ్చే నెల 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్దమవుతుంది. ఇందులో భాగంగా ట్యాంక్ బండ్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు బుధవారం మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్,హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రపాలి ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తర్వాత ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి మాట్లాడుతూ.. ఈ సారి వేడుకల్లో ట్యాంక్ బండ్ సరికొత్త అందాలతో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2వ తేదీన సాయంత్రం ట్యాంక్ బండ్‌పై పండుగ వాతవరణాన్ని తలపించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు వివరించారు.

ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అవతరణ వేడుకలలో సామాన్య ప్రజలు కూడా ఉత్సాహంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ఆనందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సందర్శకులను ఆకట్టుకునే ప్రదర్శనలు, ఆట వస్తువులు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాలచే కార్నివాల్ ప్రదర్శనలు జరిపేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె వివరించారు. ప్రధాన వేదికపై పలు శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం 'జయ జయహే తెలంగాణ' పై పోలీసు సిబ్బంది తో ప్రదర్శన నిర్వహించనున్నట్లు, బాణాసంచాలు పేలుస్తూ ఉత్సవ వాతవరణ అనుభూతి పొందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ట్యాంక్ బండ్‌పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటిలో రాష్ట్రంలోని హస్త కళలలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరం లోని పలు ప్రముఖ హోటళ్ళచే ఫుడ్ కోర్టులు ఉండనున్నాయి. వేదిక అలంకరణ, వేడుకలకు హాజరయ్యే అతిధిలకు, పాల్గొనే ప్రజలకు సిటింగ్, బ్యారికేడింగ్, పార్కింగ్, త్రాగు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, పోలీస్ బందోబస్త్ తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు, మోబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్ఈడీ స్క్రీన్ ల తో, కార్యక్రమాన్ని లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్శన, సమీక్షలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ , హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీ సుదర్శన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, పంచాయత్ రాజ్ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రపాలి, సిటీ పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. 


Similar News