CM Revanth Reddy: వారు కోరుకున్నది తప్పకుండా ఇచ్చి తీరుతా

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ఒక ఎక్స్ పైరీ మెడిసిన్ (కాలం చెల్లిన మందు) అని వ్యాఖ్యానించిన సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)... సంవత్సరం కూడా తిరక్కుండానే ఆయనను ఫామ్ హౌజ్(Farm house) నాలుగు గోడలకు పరిమితం చేశానని అన్నారు.

Update: 2024-10-29 14:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ఒక ఎక్స్ పైరీ మెడిసిన్ (కాలం చెల్లిన మందు) అని వ్యాఖ్యానించిన సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)... సంవత్సరం కూడా తిరక్కుండానే ఆయనను ఫామ్ హౌజ్(Farm house) నాలుగు గోడలకు పరిమితం చేశానని అన్నారు. కేసీఆర్‌(KCR) ఉనికి లేకుండా చేయడమే తన అభిమతమని, ఆ పని జరుగుతూ ఉన్నదన్నారు. తన కారణంగానే కేసీఆర్(KCR) బైటకు రాకుండా ఫామ్ హౌజ్‌(Farm house)కు పరిమతమయ్యారని అన్నారు. త్వరలో కేటీఆర్‌(KTR)కు సైతం రాజకీయ ఉనికి లేకుండా చేస్తానని అన్నారు. కొద్దిమంది మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్(CM Revanth Reddy) చిట్‌చాట్ చేస్తూ పై వ్యాఖ్యలు చేశారు. తండ్రి (కేసీఆర్)ని కంట్రోల్ చేయడానికి కొడుకు (KTR)ను వాడుకున్నట్లుగానే ఇకపైన బావ (Harish Rao)ను వాడుకుని బామ్మర్ది (KTR)ని పొలిటికల్‌గా ఫినిష్ చేస్తానని అన్నారు. ఆ తర్వాత హరీశ్‌రావును ఎలా డీల్ చేయాలో తనకు తెలుసన్నారు. పదేండ్ల కాలంలో కార్పొరేట్ కంపెనీల నుంచి భారీ స్థాయిలో డబ్బులు దిగమించిన కేసీఆర్(KTR) ఫ్యామిలీ ప్రజాధనాన్ని సైతం దుర్వినియోగం చేసిందని, విపరీతమైన అవినీతికి పాల్పడిందన్నారు. ఇప్పటికే ఆ ఫ్యామిలీ అవినీతిపై దర్యాప్తు జరుగుతున్నదని గుర్తుచేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project)లో జరిగిన అవినీతిపై ఒక కమిషన్ ఎంక్వయిరీ చేస్తున్నదని, విద్యుత్ కొనుగోళ్ళ ఒప్పందంలో మరో కమిషన్ విచారణ జరుపుతూ ఉన్నదని, ఆ రెండు కమిషన్ల నుంచి రిపోర్టులు వచ్చిన తర్వాతనే ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సీఎం వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేసే అవసరం తమకు లేదని, ఆ విధానానికి తాను వ్యతిరేకమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వ్యవస్థలను దుర్వినియోగం చేసే ప్రసక్తే లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంజెలిజెన్స్ విభాగానికి గతంలో చీఫ్‌గా వ్యవహరించిన ప్రభాకర్‌రావు చాలాకాలంగా విదేశాల్లో తలదాచుకున్నారని, ఆయన పాస్ పోర్టు ఇటీవలే రద్దయిందని, ఇప్పుడు ఆయన ఏ దేశంలో ఉన్నా ఇండియాకు రాక తప్పదన్నారు. ఆల్రెడీ ఇదే కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావుకు బైటకువస్తున్నారని అన్నారు. త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ వివాదం కొలిక్కి వస్తుందన్నారు. రామ్‌గోపాల్ వర్మ స్టైల్‌లో వెళ్ళడం నాకు ఇష్టం లేదు... అలా వెళ్ళమంటే నేను వెళ్ళను... నేను రాజమౌళి స్టైల్‌లో వెళ్తాను... అని సీఎం రేవంత్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

ఫామ్‌హౌజ్‌లలో సారాబుడ్లతో దీపావళి దావత్

కేటీఆర్(KTR) బామ్మర్ది రాజ్ పాకాలకు చెందిన ఇంట్లో విందుపై హాట్ కామెంట్ చేసిన సీఎం రేవంత్... మాకు దీపావళి పండుగ అంటే చిచ్చు బుడ్లు... లక్ష్మీ దేవికి పూజ చేయడం మాత్రమే తెలుసు... కానీ కేటీఆర్ ఫ్యామిలీ, బంధువులు మాత్రం దీపావళి దావత్‌ను సారా బుడ్లతో చేసుకుంటారేమో.... అని వ్యాఖ్యానించారు. దీపావళి దావత్ అలా చేస్తారనే సంగతి తమకు తెలియదన్నారు. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల నిజంగా ఏమీ చేయకపోతే ఎందుకు పారిపోయారు.. హైకోర్టులో పిటిషన్ వేసి ముందస్తు బెయిల్ ఎందుకు అడిగారు... అని సీఎం ప్రశ్నించారు. కుటుంబానికి సంబంధించిన దీపావళి దావత్ అయితే, ఇంటి ఫంక్షన్‌గానే ఉంటే క్యాసినో కాయిన్లు, విదేశీ మద్యం బాటిళ్ళు పరిమితికి మించి ఎందుకు దొరికాయని ప్రశ్నించారు. అదానీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చూపించాలని సవాలు చేసిన సీఎం రేవంత్... పది నెలల్లో ప్రభుత్వం ఒక్క మేజర్ టెండర్‌ను కూడా పిలవలేదన్నారు.

రియల్ ఎస్టేట్‌కు హైడ్రాకు సంబంధం లేదు :

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం(Real estate business) పడిపోవడానికి హైడ్రా కారణమంటూ విపక్షాల నేతలు గగ్గోలు పెడుతున్నారని, కానీ అది కారణం కాదన్నారు. ఒకవేళ నిజంగా అదే కారణమని నమ్మించే ప్రయత్నం చేస్తే... వరంగల్, కరీంనగర్‌లో హైడ్రా లేకపోయినా అక్కడ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎందుకు దెబ్బతిన్నదని సీఎం రేవంత్ ఎదురు ప్రశ్నించారు. దేశవ్యాప్తంగానే రియల్ ఎస్టేట్ బిజినెస్ పడిపోయిందని, తెలంగాణ కూడా అందుకు మినహాయింపు కాదన్నారు. కానీ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఉద్దేశంతో హైడ్రాకు ముడిపెడుతున్నారని ఆరోపించారు. హైడ్రా వ్యవస్థ పట్ల ప్రజల్లో చెడు అభిప్రాయం కలిగించడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రతిపక్షాలు పనిగట్టుకుని ఈ దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు.

దమ్ముంటే పాదయాత్రకు రావాలి :

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై హరీశ్‌రావు, కేటీఆర్ అర్థరహితమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించిన సీఎం రేవంత్... త్వరలో వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు తాను ఈ అంశంతో పాదయాత్ర చేస్తానని, దమ్ముంటే వారిద్దరూ తనకూ కలిసి రావాలని సవాలు విసిరారు. మూసీని అభివృద్ధి చేయాలో లేదో ఆ పాదయాత్రలోనే గ్రామాల ప్రజలను అడుగుతామన్నారు. మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టే కేసీఆర్, హరీశ్, కేటీఆర్ ఒక సీఎంగా తనను కలవడం ఇష్టం లేకపోతే ప్రధాన కార్యదర్శిని కలవొచ్చని సూచించారు. మూసీ మురికి కంపు పక్కన ఉండడానికి ఎవరైనా ఇష్టపడతారా అని ప్రశ్నించిన సీఎం... కేటీఆర్, ఆయన బామ్మర్ది, హరీశ్‌రావు లాంటివారు ఫామ్ హౌజ్‌లు కట్టుకుని విలాసవంతంగా బతకాలిగానీ... పేదలకు మాత్రం ఆ మురికి కంపును అంటిస్తారా అని ప్రశ్నించారు. బలిసి పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నవారికి మూసీ ప్రజల కష్టసుఖాలు ఎలా తెలుస్తాయన్నారు. ఈ ప్రాజెక్టుకు లక్షన్నర కోట్ల రూపాయల ఖర్చు అంటూ పనిగట్టుకునని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఖర్చు విషయంలో ఇప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని, వారు చేస్తున్న ప్రచారంలోని అంశాలన్నీ పచ్చి అబద్ధాలన్నారు.

ఫస్ట్ ఫేజ్‌లో బాపూ ఘాట్ వరకు :

మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును ఎవరు ఎంతగా అడ్డుకున్నా ఆగదని, ప్రభుత్వం దాన్ని కంప్లీట్ చేసి తీరుతుందని సీఎం రేవంత్ నొక్కిచెప్పారు. ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా గండిపేట, హిమాయత్‌సాగర్‌ నుంచి బాపుఘాట్ వరకు దాదాపు 30 కి.మీ. మేర పనులను చేపడతామని, నెల రోజుల్లోనే డిజైన్లు పూర్తవుతాయన్నారు. మల్లన్న సాగర్ నుండి గోదావరి జలాలను తెచ్చి గండిపేటలో పోస్తామన్నారు. దీనికి సంబంధించి ట్రంక్ లైన్ కోసం నవంబర్ మొదటి వారంలో టెండర్లు పిలుస్తామన్నారు. బాపుఘాట్ దగ్గర ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడే వద్ద బ్రిడ్జి కం బ్యారేజి నిర్మాణాన్ని కూడా చేపడతామన్నారు. ఆ ప్రాంతంలో అభివృద్ధి కోసం ఆర్మీ ల్యాండ్‌ను కూడా ఆడిగామని గుర్తుచేశారు. మురికి నీటి శుద్ధీకరణ కూడా ఈ ప్రాజెక్టులో ఒక భాగమైనందున 15 రోజుల్లోనే ఎస్టీపీ (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్)లకు టెండర్లను పిలుస్తామన్నారు. మూసీని ఎకో ఫ్రెండ్లీ, వెజిటేరియన్ కాన్సెప్టుతో అభివృద్ధి చేస్తామన్నారు. మూసీ వెంట అంతర్జాతీయ యూనివర్సిటీ, గాంధీ ఐడియాలజీ సెంటర్, రీక్రియేషన్ సెంటర్, నేచర్ క్యూర్ సెంటర్, నైట్ సిటీలను ఏర్పాటు చేస్తామన్నారు.

మూసీపై త్వరలో అఖిలపక్ష సమావేశం :

పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపడతామని, డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారీ కోసం రూ. 140 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని, అధికారులకు, డిజైనర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు సీఎం తెలిపారు. త్వరలోనే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని, అన్ని పార్టీల నేతల అభిప్రాయాలను తీసుకుంటామన్నారు. మూసీ పునరుజ్జీవం విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. మల్లన్న సాగర్ కోసం 14 గ్రామాలనే గత ప్రభుత్వం ఖాళీ చేయించిందని, దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ జరగలేదన్నారు. ఇప్పుడు మూసీ అభివృద్ధి విషయంలో నిర్వాసితులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరిస్తుందని, ప్రతీ కుటుంబానికి న్యాయం చేసే బాద్యత తమ ప్రభుత్వానిది అని అన్నారు. ప్రాజెక్టు అమలు విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికే 33 బృందాలతో సర్వే కంప్లీట్ అయిందని, నిర్వాసిత కుటుంబాల పిల్లలకు ఉచిత విద్యను ప్రభుత్వం అందిస్తుందని, ఆ కుటుంబాలకు అన్ని సదుపాయాలనూ కల్పిస్తామన్నారు. నవంబర్ ఫస్ట్ వీక్‌లో ఫస్ట్ ఫేజ్ పునరుజ్జీవం కోసం టెండర్లను పిలుస్తామన్నారు.

అభివృద్ధిపైనే ప్రభుత్వం ఫోకస్ :

గత ప్రభుత్వ అవినీతిపై విచారణా కమిషన్‌లు రిపోర్టు ఇచ్చిన తర్వాతే చర్యలుంటాయని స్పష్టం చేసిన సీఎం రేవంత్... “నేను కోరుకున్నది ప్రజలు ఇచ్చారు.. ఇప్పుడు వారు కోరుకున్నది నేను ఇవ్వాలి...” అని వ్యాఖ్యానించారు. యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీ, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్శిటీలను నిర్మిస్తున్నామన్నారు. అనేక పరిశ్రమలు ముందుకొస్తున్నాయని, రాష్ట్రంలో నిరుద్యోగులకు, పట్టభద్రులకు శిక్షణ కల్పించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికే ప్రభుత్వం ఈ చొరవ తీసుకున్నదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఒప్పందాలను కుదుర్చుకున్నదో బైటపెడతానని హెచ్చరించారు.

Tags:    

Similar News