Deputy CM Bhatti: ప్రతి రోజూ ఒక్కొక్కరు ఏడు ఇండ్లలో సర్వే

రాష్ట్రవ్యాప్తంగా కులగణను సమర్ధవంతంగా నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఇటీవల పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించింది.

Update: 2024-10-29 16:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా కులగణను సమర్ధవంతంగా నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఇటీవల పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించింది. దీనికి కొనసాగింపుగా రెండు రోజుల నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) వరుస రివ్యూలు చేస్తున్నారు. మేధావులతో సోమవారం సమావేశమై అభిప్రాయాలను తీసుకున్న డిప్యూటీ సీఎం... మంగళవారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి వివరాలను సేకరించడంపై దిశానిర్దేశం చేశారు. లోపాల్లేకుండా గణాంకాలను, వివరాలను సేకరించడంలోని ప్రాధాన్యతను నొక్కిచెప్పి ఇందుకు అవసరమైన శిక్షణను ఎన్యూమరేటర్లకు అందించాల్సిన అవసరంపై కలెక్టర్లు, అధికారులకు వివరించారు. పాఠశాలల టైమింగ్ ముగిసిన తర్వాత ఉపాధ్యాయుల సేవలను కులగణన సర్వే కోసం వినియోగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఒక్కో టీచర్‌కు రోజుకు 5 నుంచి 7 ఇండ్లను సందర్శించి సర్వే కోసం రూపొందించిన ప్రశ్నలకు వివరాలను తీసుకోవాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రక్రియను సజావుగా జరిగేందుకు చొరవ తీసుకోవాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. కలెక్టర్లు ఫీల్డ్ స్థాయికి వెళ్ళి సర్వే ప్రక్రియను పర్యవేక్షించాలని, అవసరమైన సూచనలు చేయాలని పేర్కొన్నారు. సర్వే కోసం రూపొందించిన ప్రశ్నలకు వివరాలను తీసుకోవడానికి అవసరమైన శిక్షణపై దృష్టి పెట్టాలని, క్షేత్రస్థాయికి వెళ్ళే ముందే వారికి ఆ ప్రశ్నావళిపై పూర్తి అవగాహన ఏర్పడేలా చూడాలని కోరారు. టీచర్లు కూడా వారి టైమింగ్స్ కు అనుగుణంగా అవసరమైన సమయాన్ని ఈ సర్వే కోసం కేటాయించాలని విజ్ఞప్తి చేయాలన్నారు. ఎన్యూమరేటర్లతో పాటు సూపర్‌వైజర్లు, వివిధ పనుల్లో ఉండే ప్రభుత్వ సిబ్బందికి ఆకర్షణీయమైన వేతనాన్ని చెల్లించాలని, ఇప్పటికే అధికారులకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు డిప్యూటీ సీఎం గుర్తుచేశారు. ఈ సర్వే జరుగుతున్న గ్రామాలు, పట్టణాలను కలెక్టర్లు ప్రతీ రోజూ సందర్శించి సమీక్షించాలని కోరారు. సూపర్‌వైజర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించి ఆచరణాత్మక ఇబ్బందులపై చర్చించి తగిన సూచనలు చేయాలన్నారు.

ఈ సర్వేలోని వివరాలు ప్రభుత్వానికి వివిధ రకాలుగా ఉపయోగపడుతున్నందున పకడ్బందీగా ఉండాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. వివరాలను సేకరించే ఎన్యూమరేటర్లకు మాన్యువల్ తప్పనిసరిగా అందించాలని, ఒక ఇంటికి వెళ్ళే ముందే ఆ కుటుంబానికి సంబంధించిన వివరాల్లో కొన్నింటిని భర్తీ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఏ రోజు ఏ గ్రామం, పట్టణంలో సర్వే జరుగుతున్నదో ప్రజలకు తెలిసేలా స్థానిక రెవెన్యూ యంత్రాంగం చాటింపు ద్వారా తెలియజేయాలన్నారు. సామాజిక కులగణనను ప్రచారం చేయడానికి మీడియా సేవలను కూడా విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో ఆయా జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర రావు కూడా పాల్గొన్నారు. సమానత్వాన్ని సాధించాలని రాజ్యాంగం లక్ష్యంగా పెట్టుకున్నదని గుర్తుచేసిన డిప్యూటీ సీఎం... నవంబర్ 6 వ తేదీ నుండి సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వే చేపట్టనున్నందున అన్ని జాగ్రత్తలను సూచించారు.

‘సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే’లో అన్నింటినీ చేర్చాలన్నారు. వివిధ సెక్షన్ల ప్రజల సామాజిక, ఆర్థిక, ఆదాయ విద్య, రాజకీయ స్థితిగతులను ఈ సర్వే ద్వారా తెలుసుకునే వెసులుబాటు లభిస్తుందన్నారు. సామాజిక సర్వే ద్వారా నిర్దిష్ట లక్ష్యాలను ప్రభుత్వం సాధిస్తుందని, దానికి అనగుణంగా సంక్షేమ పథకాల ఫలాలను వారి చెంతకు చేర్చడానికి వీలవుతుందన్నారు.

Tags:    

Similar News