రాష్ట్రంలో సుప్రీం తీర్పును అమలు చేయాలి : మందకృష్ణ మాదిగ
రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
దిశ, సికింద్రాబాద్: రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. వర్గీకరణ అమలు చేస్తే విజయోత్సవం లేదంటే సర్కారుకు చావు డప్పు అని ఆయన పేర్కొన్నారు. వేల గొంతులు - లక్ష డప్పుల కార్యక్రమానికి మద్దత్తుగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ హాజరై మాట్లాడారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరగబోయే వెయ్యి గొంతులు లక్ష డప్పుల మండే మాదిగల గుండె చప్పుడు దండోరా సాంస్కృతిక మహా ప్రదర్శన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని రెండుసార్లు సాధిస్తే వర్గీకరణ ఉద్యమంతో వర్గీకరణను మూడుసార్లు సాధించామని గుర్తు చేశారు. ఇప్పటికీ కొంతమంది మాలలు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్గీకరణకు అడ్డుపడుతూ కొంతమంది చర్యల వల్ల సమాజంలో మాలలు చీదరించబడుతున్నారని పేర్కొన్నారు. వర్గీకరణ ఉద్యమానికి సమాజంలోని అన్ని వర్గాల మద్దతు ఉంటే వర్గీకరణ వ్యతిరేకులు మాత్రం ఒంటరి వాళ్ళు అని అన్నారు.
ఆనాడు తెలంగాణకు అడ్డుపడింది లగడపాటి రాజగోపాల్ రెడ్డి అయితే వర్గీకరణకు అడ్డుపడేది వివేక్ వెంకటస్వామి అని పేర్కొన్నారు. లగడపాటి కంటే వెయ్యి రెట్లు వివేక్ శక్తివంతుడని కానీ న్యాయమైన వర్గీకరణ ముందు వివేకు ఓడిపోవలసిందే అని అన్నారు. వర్గీకరణ చేస్తామంటే అన్ని పార్టీలకు మద్దతిచ్చాం, వర్గీకరణ చేయకుంటే అన్ని పార్టీల పైన యుద్ధం చేశామన్నారు. తాను ఏ ఒక్క పార్టీకి చెందిన వాడను కానని, తన ఒంటి మీద నల్ల కండువా ఎప్పటికీ మారదని చెప్పారు. మాదిగ జాతి తో పాటు సమాజంలోని వెనుకబడ్డ వర్గాల కోసం అనేక సామాజిక ఉద్యమాలను నిర్వహించి, దేశంలో ఎక్కడా లేని ఫలితాలను తెలుగు నేలమీద సాధించామన్నారు.
అంతిమ పోరాటంగా ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని ముందు పెట్టి మాదిగల అస్తిత్వమైన డప్పు తోనే యుద్ధం చేయబోతున్నామని తెలిపారు. ఫిబ్రవరి 7న నింగి నేల దద్దరిలేలా మాదిగల గుండె చప్పుడు వినిపిస్తామని చెప్పారు.ఈ సమావేశంలో నాయకులు డాక్టర్ దరువు ఎల్లన్న, డాక్టర్ నలిగంటి శరత్ చామర్, తెలంగాణ ఉద్యమ నేత డాక్టర్ .పృథ్వీరాజ్ యాదవ్, ఇస్మాయిల్, డాక్టర్ దరువు అంజన్న,మిట్టపల్లి సురేందర్, డాక్టర్ పుల్లారావు యాదవ్,అంతడుపుల నాగరాజు,గుడిపల్లి రవి, మాట్ల తిరుపతి,సోమారపు మురళీకృష్ణ,డా.బండారి వీరబాబు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ, ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ, జంగిలి దర్శన్ తదితరులు పాల్గొన్నారు.