నాణ్యమైన ఆహారం అందించాలని ఓయూ లో రోడ్డెక్కిన విద్యార్థులు
ఉస్మానియా యూనివర్సిటీ లోని పీజీ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని గురువారం విద్యార్థులు యూనివర్సిటీ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
దిశ,సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ లోని పీజీ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని గురువారం విద్యార్థులు యూనివర్సిటీ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ..ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో కనీస మౌలిక వసతులు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందించే ఆహారంలో కూడా నాణ్యత కరువైందని మండిపడ్డారు. హాస్టల్ సమస్యలపై చీఫ్ వార్డెన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మెనూ ప్రకారం తమకు నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. హాస్టల్ లో టాయిలెట్స్ అధ్వానంగా మారాయని, త్రాగడానికి మంచినీరు కూడా లేదని చెప్పారు. మెస్ చార్జీలు అడ్డగోలుగా పెంచుతున్న అధికారులకు తమ సమస్యలు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం వండిన చికెన్ బొక్కలు టిఫిన్ చేస్తుంటే... టిఫిన్ లలో వస్తున్నాయని చెప్పారు. రుచి, సుచీ లేని నాణ్యత కరువైన వంటకాలు చేసి వడ్డిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.