Private hostels : సేఫ్టీ లేదు.. క్లారిటీ ఉండదు !

గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రైవేట్ హాస్టళ్లు ( Private hostels) పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.

Update: 2024-10-26 03:01 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రైవేట్ హాస్టళ్లు ( Private hostels) పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వీటిల్లో చాలా హాస్టళ్లకు ఎలాంటి అనుమతులు లేకుండానే నడుపుతున్నారు. ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని వీటిల్లో ఉంటున్న వారు వాపోతున్నారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా వీటిని ఏర్పాటు చేస్తున్న అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా, జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ, ఫైర్ వంటి అనుమతులు లేకుండా ఎక్కడపడితే అక్కడ భవనాలు అద్దెకు తీసుకుని హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ హాస్టళ్ల దందా పెరిగిపోయింది. ముఖ్యంగా కోచింగ్ సెంటర్‌లు, విద్య, వ్యాపార సంస్థలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు అధికంగా ఉండే దిల్‌సుఖ్ నగర్, కొత్తపేట, కోఠి, అబిడ్స్, మాదాపూర్, చందానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్‌ఆర్ నగర్, కూకట్‌పల్లి వంటి ప్రాంతాలలో ప్రైవేట్ వసతిగృహాలు ఇష్టారాజ్యంగా వెలుస్తున్నాయి. కేవలం లాభార్జనే ధ్యేయంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ ఆహార నాణ్యత మాత్రం పాటించడం లేదు. గడువు ముగిసిన ఆహార పదార్ధాలు, కుళ్లిపోయిన కూరగాయలు వంటలకు ఉపయోగించటం వంటివి గతంలో అనేకం వెలుగులోకి వచ్చాయి.

లైసెన్స్‌లు లేకుండానే..

గతంలో అధికారులు చేపట్టిన దాడులలో పలు ప్రైవేట్ హాస్టల్స్ నిర్వాహకులు ఫుడ్ లైసెన్స్ ( Food license ) లేకుండానే నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అప్పుడప్పుడు అధికారులు చేస్తున్న దాడులలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ప్రతి హాస్టల్‌లో ఏదో ఒకరకమైన సమస్య ఉన్నట్లు తేలింది. ఏమాత్రం శుభ్రత లేకుండా తయారు చేసిన ఆహార పదార్థాలను సైతం పట్టుకున్నారు. మాదాపూర్‌, ఎస్సార్‌ నగర్‌, కూకట్‌పల్లి ప్రాంతాల్లోని పలు వర్కింగ్ మెన్, ఉమెన్స్ హాస్టళ్లలో అధికారులు సోదాలు ( searches) నిర్వహించి వంట గదులలో దారుణ పరిస్థితులు ఉన్నట్లు తేల్చారు. కాలంచెల్లిన ఆహార పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. చాలా యాజమాన్యాలు పాడైపోయిన వస్తువులతో ఆహారాన్ని తయారు చేస్తున్నాయి. కిచెన్‌లో బల్లులు, బొద్దింకలు తిరుగుతున్నట్లు కనిపించాయి. ఇవే కాకుండా వంట చేసే వారితో పాటు పనివాళ్లు గుట్కాలు, పాన్ మసాలాలు, తంబాకు తింటుండం, వంట గదులలో ఎక్కడపడితే అక్కడ పాన్ తిని ఊసిన మరకలు ఉన్నా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. హాస్టళ్ల నిర్వాహకులకు టాస్క్‌ఫోర్స్ అధికారులు నోటీసులు ఇచ్చి అనంతరం పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ హాస్టల్స్ దందా నగరంలో మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లుతున్నాయి.

బాధితులలో అధిక శాతం నిరుద్యోగులే..

నగరంలో ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేస్తున్న ప్రైవేట్ హాస్టళ్లు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు ( Charge fees ) చేస్తున్నా వీటిల్లో వసతులు మాత్రం అరకొరగానే ఉంటున్నాయి. ఫ్యాన్లు సరిగ్గా తిరగకపోవడం, బాత్రూం, టాయిలెట్లు శుభ్రంగా లేకపోవడం, గోడల పై ఎక్కడపడితే అక్కడ బూజు, పాన్, గుట్కాలు తిని ఉమ్మిన మరకలు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాల నుంచి నగరానికి ఉన్నత చదువులు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడం కోసం వచ్చిన యువతతో పాటు బ్యాచులర్ ఉద్యోగులను నిర్వాహకులు టార్గెట్ చేస్తున్నారు. సకల వసతులు ఉంటాయని నమ్మకం కల్గించేలా మాట్లాడి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ముందుగానే ఫీజు కలెక్ట్ చేస్తుండడంతో వీటిల్లో చేరిన వారు వసతులు లేకున్నా సర్దుకుపోతున్నారు.

హోటల్స్, స్వీట్ సెంటర్లది అదే తీరు..?

గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రైవేట్ హాస్టల్స్ మాత్రమే కాకుండా పేరొందిన హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ సెంటర్లలో కూడా నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. శుక్రవారం నగరంలోని అమీర్‌పేట్ ప్రాంతంలోని పలు స్వీట్ సెంటర్ల పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి ఫుడ్స్, వినూత్న ఫుడ్స్, ఆగ్రా స్వీట్ హౌజ్, ఢిల్లీ మిఠాయి వాలా వంటి పేరొందిన స్వీట్ సెంటర్లలో కూడా సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని అధికారులు గుర్తించారు. కిచెన్‌లలోని డస్ట్ బిన్ల పై కూడా మూతలు తెరిచి ఉంచారు. ఇలా ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు లేకుండా ధనార్జనే ధ్యేయంగా ఏర్పాటు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్న ప్రైవేట్ హాస్టళ్లు, హోటల్స్, స్వీట్ సెంటర్లపై తరచుగా దాడులు నిర్వహించాలని నగర ప్రజలు కోరుతున్నారు.


Similar News