City Court: మంత్రి కొండా సురేఖకు సిటీ కోర్టు హెచ్చరిక

సినీ నటులు అక్కినేని నాగచైతన్య(Akkineni Nagachaitanya), సమంత(Samantha) విడాకుల వ్యవహారం

Update: 2024-10-25 15:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సినీ నటులు అక్కినేని నాగచైతన్య(Akkineni Nagachaitanya), సమంత(Samantha) విడాకుల వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) ఈ నెల 2వ తేదీన చేసిన వ్యాఖ్యలకువ్యతిరేకంగా బీఆర్ఎస్ నేత కేటీఆర్(KTR) దాఖలు చేసిన పరువు నష్టం దావాపై సిటీ సివిల్ కోర్టు శుక్రవారం విచారణ జరిపి మంత్రికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి అసభ్యకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ మందలించింది. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని, రిపీట్ కాకుండా చూసుకోవాలని హెచ్చరించింది. మహిళా మంత్రిగా ఉండి కూడా అభ్యంతరకరమైన తీరులో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. కేటీఆర్(KTR) స్వయంగా పరువునష్టం దావా వేసినందువల్ల ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలగకుండా జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇస్తూనే అడ్డగోలుగా, ఆధారాలు లేకుండా వ్యక్తిగతమైన అంశాల జోలికి వెళ్ళవద్దని సూచించింది. అత్యంత జుగుప్సాకరంగా ఉన్న ఆమె వ్యాఖ్యల వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి, వెబ్‌సైట్‌ల నుంచి, ప్రధాన మీడియా నుంచి తొలగించాలని ఆదేశించింది.

యూ ట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ తదితర సోషల్ మీడియా యాజమాన్యాలకు కూడా ఆ వీడియోలను తొలగించాలని సిటీ సివల్ కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు కొండా సురేఖ(Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేసిన మీడియా సంస్థలు సైతం వీడియోలను, కథనాలను తొలగించాలని ఆదేశించింది. మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని, ఆమె చేసిన కామెంట్లకు సంబంధించిన అన్ని కథనాలను, వీడియోలను పబ్లిక్ డొమెయిన్‌లో ఉండకూడదని స్పష్టం చేసింది. సంబంధిత మీడియా, సోషల్ మీడియా సంస్థల యాజమాన్యాలకు ఆదేశాలు ఇస్తున్నట్లు గుర్తుచేసింది. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో తనకు వ్యక్తిగతంగా, తాను ప్రాతినిధ్యం ఉన్న పార్టీకి చెడ్డపేరు వచ్చినందున, పరువు ప్రతిష్టలకు భంగం కలిగినందున రూ. 100 కోట్లతో ఆమెపై సివిల్ డిఫమేషన్ కేసును నాంపల్లి కోర్టు(Nampally Court)లో కేటీఆర్(KTR) దాఖలు చేయగా దానిపై విచారణ సందర్భంగా జడ్జి పై ఆదేశాలు ఇచ్చారు. పరువునష్టం కేసులో మంత్రి స్థాయిలో ఉన్నవారిపై కోర్టు ఇంతటి తీవ్ర స్థాయిలో సీరియస్ కామెంట్లు చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అని బీఆర్ఎస్ శ్రేణులు వ్యాఖ్యానించాయి. కేటీఆర్‌పై భవిష్యత్తులో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని మంత్రి సురేఖకు కోర్టు స్పష్టం చేయడంపైనా సంతోషం వ్యక్తం చేశాయి.

మరోవైపు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన డిఫమేషన్ కేసు ఇదే కోర్టులో విచారణలో ఉన్నది. క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ పిటిషన్‌లో నాగార్జున కోరారు. కోర్టు సమక్షంలో స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. ఈ పిటిషన్ ఇంకా విచారణలో ఉన్నది. తదుపరి విచారణ నవంబరు 11న జరిగేలా నాంపల్లి కోర్టు వాయిదా వేసింది.

Tags:    

Similar News