drugs : అక్రమ డ్రగ్స్ దందా.. నాలుగు దేశాలకు చెందిన వారి నుంచి మత్తు పదార్థాలు..
డ్రగ్స్ సరఫరా కోసం డెడ్ డ్రాప్ (కాంటాక్ట్ లెస్) పద్ధతిని ఎంచుకుని హైదరాబాద్‌లో అక్రమంగా డ్రగ్స్ సప్లై చేస్తున్న సూడాన్ దేశస్థుడిని అరెస్టు చేశారు.
దిశ, సిటీక్రైం : డ్రగ్స్ ( drugs ) సరఫరా కోసం డెడ్ డ్రాప్ (కాంటాక్ట్ లెస్) పద్ధతిని ఎంచుకుని హైదరాబాద్‌లో ( Hyderabad ) అక్రమంగా డ్రగ్స్ సప్లై చేస్తున్న సూడాన్ దేశస్థుడిని అరెస్టు చేశారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బెంగళూరులో నివాసం ఉంటున్న నైజీరియన్స్, టాంజానియా, పాలస్తీనా, సూడాన్ దేశాలకు చెందిన వారి నుంచి డ్రగ్స్‌ను తీసుకుని వాటిని హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారనే సమాచారాన్ని హైదరాబాద్ హెచ్ఏన్యూ పోలీసు సేకరించారు. హూమాయున్ నగర్ పోలీసుల సహకారంతో జాయింట్ ఆపరేషన్‌ను నిర్వహించి సూడాన్‌కు చెందిన మహ్మద్ ఉస్మాన్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. అతని నుంచి 7.75 లక్షలు విలువ చేసే 50 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, ఐ-ఫోన్ 13ను స్వాధీనం చేసుకున్నామని సీపీ వివరించారు.
డెడ్ డ్రాప్ పద్ధతిలో సరఫరా..
పోలీసులకు చిక్కకుండా మహ్మద్ ఉస్మాన్ కాంటాక్ట్ లెస్ పద్ధతిలో ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ డెడ్ డ్రాప్(కాంటాక్ట్ లెస్) పద్ధతిలో ఒకరికి ఒకరు కలుసుకోకుండానే మత్తు పదార్ధాలు డెలివరి అయిపోతాయి. మత్తుపదార్ధం ఆర్డర్ తీసుకోగానే డబ్బులను ఫోన్ పే, జీ పే ద్వారా వేయించుకుని, ఆ తర్వాత డ్రగ్స్ పెట్టిన లోకేషన్, ఎందులో ఉందనే ఫోటోను ఆర్డర్ ఇచ్చిన వారికి పంపిస్తారు.
చదువుకునేందుకు వచ్చి డ్రగ్స్ దందా..
సూడాన్‌కు చెందిన మహ్మద్ ఉస్మాన్ ఉత్తర్ ప్రదేశ్‌లోని గ్లోబల్ యూనివర్సిటీలో బీసీఏ చదువుతున్నాడు. అతనికి బెంగళూరులోని సూడాన్, టాంజానియా, నైజీరియా, పాలస్తీనా దేశాలకు చెందిన వారితో పరిచయం కాగా అందులో మత్తుమందు దందా చేసే కొంతమంది నుంచి వాటిని సేకరించి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు.
ఐ-ఫోన్‌లో 11 మంది చిట్టా..
మహ్మద్ ఉస్మాన్ నుంచి మత్తుపదార్ధాలను కొనుగోలు చేస్తున్న 11 మంది చిట్టా పోలీసులకు చిక్కింది. ఇందులో సంపన్నుల కుటుంబాలకు చెందిన వారు ఉన్నట్లు సీపీ పేర్కొన్నారు. దర్యాప్తులోని నిబంధనల దృష్ట్యా వారి పేర్లను వెల్లడించలేమని సీపీ పేర్కొన్నారు.
మరో కేసులో..
కంచన్ బాగ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న మహమ్మద్ ఇమ్రాన్ బెంగళూరులోని విదేశీయుల నుంచి మత్తు పదార్ధాలను తీసుకువచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నాడు. ఇమ్రాన్‌తో పాటు దందా చేస్తున్న నంద కుమార్, నవీన్‌లను హెచ్ఏన్యూ, కంచన్ బాగ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 80 గ్రాముల ఎల్ఎస్డీ బ్లాట్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. ఇమ్రాన్ పై గతంలో మత్తు పదార్ధాల సరఫరాకు సంబంధించిన కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.