స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ బిగ్ ప్లాన్.. ఎమ్మెల్సీ కవిత కీలక ప్రకటన
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపు నిచ్చారు
దిశ, తెలంగాణ బ్యూరో : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపు నిచ్చారు. పార్టీ కార్యకర్తలకు, స్థానిక నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని అధిష్టానం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎమ్మెల్యే పార్టీ మారారనే అంశంతో సంబంధం లేకుండా గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఆదివారం జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ దేశ చరిత్రలోనే అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత మూట గట్టుకున్న ప్రభుత్వం ఎక్కడా లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ఏ ఒక్క పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించలేకపోతోందన్నారు. ఎన్నికల్లొ ఇచ్చిన హామీలను ఇంకా ప్రారంభించలేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి, వైఫల్యాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారిన వ్యక్తులను ప్రజలు క్షమించరని స్పష్టం చేశారు. జగిత్యాలకు, తనకు ఆత్మీయ అనుబంధం ఉందన్నారు. 2014లో నిజమాబాద్ ఎంపీగా తాను గెలిచినా, జగిత్యాల ఎమ్మెల్యేగా సంజయ్ కుమార్ ఓడిపోయారని, కానీ పార్టీలకు అతీతంగా, వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసుకువాలని, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా, అభివృద్ధిలో జగిత్యాల వెనకబడొద్దు అనే ఆదేశాలను కేసీఆర్ ఇచ్చారని కవిత గుర్తుచేశారు.
తెలంగాణ ఏర్పడగానే చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకోవాలని, చిన్న జిల్లాల ద్వారానే ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని గ్రామాల్లో ఉన్న ప్రతి పేద వ్యక్తికి కూడా తెలంగాణ సాధించిన ఫలితం అందుతుందని కేసీఆర్ తెలంగాణ ఉద్యమం రోజుల్లోనే చెప్పేవారని కవిత గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్, జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేయడంతో పాటు, హైదరాబాద్ తరువాత ఎక్కువ సంఖ్యలో, 4,500 డబుల్ బెడ్ రూం ఇండ్లు జగిత్యాలకే కేటాయించి ప్రత్యేక శ్రద్ద చూపెట్టారని అన్నారు. ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్, అప్పుడు ఎమ్మెల్యే కాకపోయినా, పార్టీ ప్రతి కార్యక్రమంలో వేదిక పైకి తీసుకొచ్చి, కాబోయే ఎమ్మెల్యే అంటూ ఐదు సంవత్పరాల పాటు ప్రతి గ్రామంలో చెప్పామని అన్నారు. ఓడిపోయినా వదిలేయకుండా గౌరవంగా చూసుకుంటామనే సందేశం ఇచ్చిన సభ్యత గల పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. ఆనాడు జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డి ఎన్ని ఆకృత్యాలు, ఆఘాయిత్యాలు చేసినా, బీఆర్ఎస్ కార్యకర్తలంతా ముందుండి కొట్లాడారు కాబట్టే, జగిత్యాలలో గులాబీ జెండా ఎగిరిందని తెలిపారు. నాయకులు పార్టీలు మారినా, కార్యకర్తలు పార్టీలోనే ఉంటారని చెప్పడానికి మంచి ఉదాహరణగా పేర్కొన్నారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి మారిపోయినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్తే అర్థముండేదని, కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా గోడ మీద పిల్లిలాగా ఉండటం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం లాంటిదని ఫైర్ అయ్యారు. అలాంటి వ్యక్తులను ప్రజలు క్షమించరని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకోవడం పిరికితనమని, అలాంటి నాయకులు బీఆర్ఎస్‌కు అవసరం లేదని స్పష్టం చేశారు. గులాబీ జెండా అంటేనే గుండె ధైర్యం, గులాబీ జెండా అంటేనే ఉద్యమ పిడికిలి అని అన్నారు. పిరికివాళ్లు, పదవుల వ్యామోహం ఉన్న వాళ్లు బీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదని తేల్చి చెప్పారు.
ప్రతి గ్రామంలో వాట్సాప్ గ్రూప్ లు, సోషల్ మీడియా సిద్దం చేసుకోవాలని, కేసీఆర్ హయంలో ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది అనే అంశాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలని నాయకులకు పిలుపు నిచ్చారు. కరెంటు కోతలు, రైతు భరోసా, మహిళలకు నెలకు రూ. 2,500 ఇవ్వకుండా ఎలా మోసం చేసారనే అంశాలను ఇప్పటినుండే చెప్పాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. కేటీఆర్ సూచనలను తీసుకొని, స్థానిక సంస్థల ఎన్నికల్లో జగిత్యాలలో మెజారిటీ సీట్లు గెలిచేవిధంగా ప్రణాళికలు సిద్దం చేయాలని అన్నారు. నీ కోసం తపించిన బిడ్డ కష్టాల్లో ఉండి, జైల్లో ఉన్నప్పుడు పార్టీ మారిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, రాజకీయాలకు మచ్చ తెచ్చారని కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగర్ రావు విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగర్ రావు, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, స్థానిక నేతలు పాల్గొన్నారు.
నేడు కులగణన కమిషన్‌కు వినతి
బీసీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులతో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. యునైటెడ్ ఫులే ఫ్రంట్, తెలంగాణ జాగృతి మరియు బీసీ కుల సంఘాల ప్రతినిధులతో సుధీర్ఘంగా చర్చించారు. సోమవారం ఉదయం 11 గంటలకు కులగణన కమిషన్ కు రిపోర్ట్ అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, బీసీ నేతలు గట్టు రాంచందర్ రావు, బొల్లా శివ శంకర్ , ఆలకుంట హరి, ఉపేందర్, మఠం భిక్షపతి, రాజారాం యాదవ్, దావ సురేష్ పాల్గొన్నారు.