గ్రేటర్‌లో పెరుగుతున్న చలి

గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతున్న చలి కారణంగా

Update: 2024-11-25 02:11 GMT

దిశ,హైదరాబాద్ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతున్న చలి కారణంగా ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రతినిత్యం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా చలి తీవ్రత పెరిగి చిన్న పిల్లలు, వృద్ధులు పడరాని పాట్లు పడుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, ఆస్తమా, బ్రాంకైటిస్, కీళ్ల నొప్పులు, చర్మం పొడిగా మారి పగుళ్లు రావడం, ఛాతిలో నిమ్ము చేరడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటివి అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నారు. చలి ప్రభావం చిన్న పిల్లలపై అధికంగా చూపుతోంది. దీంతో ఆస్పత్రులలో రద్దీ పెరిగింది. ముఖ్యంగా చిన్న పిల్లల దవాఖానలు కిటకిటలాడుతుండగా పాఠశాలల్లో సైతం విద్యార్థుల హాజరు శాతం తగ్గుతుంది.

అలర్జీ లక్షణాలు..

గ్రేటర్ పరిధిలో పెరుగుతున్న చలి కారణంగా పిల్లలు, వృద్ధులలో అలర్జీ లక్షణాలు అధికంగా కనబడుతున్నాయి. కాళ్లు, చేతులపై చర్మం ముడత పడటం తో పాటు కీళ్ల సంబంధ సమస్యలు వస్తున్నాయి. కొంతమందిలో శ్వాసకోశ సమస్యలు కనిపిస్తున్నాయి. చర్మం పొడిబారడం కారణంగా దురద, మంట తో పాటు పగుళ్లు ఏర్పడుతున్నాయి. చాలా మందిలో జ్వరం లక్షణాలు కనబడుతుండడంతో ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు.

ముందు జాగ్రత్తలు తప్పనిసరి..

చలికాలంలో శ్వాసకోశ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్నపిల్లలను చలిగాలిలో తిప్పకుండా వెచ్చని వాతావరణంలో ఉండేలా తల్లిదండ్రులు చూడాలి. వారిని తప్పనిసరి బయటకు తీసుకువెళ్లాల్సి వస్తే తలకు మంకీ క్యాప్‌, ఒంటికి స్వెటర్‌ వేయాలి. చలి గాలులు ఎక్కువగా వీచే సమయంలో ఎముకల, జాయింట్లు, కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. దగ్గు, జలుబుతో పాటు చర్మ సమస్యలు కూడా తలెత్తవచ్చు. అంతేకాకుండా బీసీ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

రోగనిరోధక శక్తిని పెంచాలి..

చలి తీవ్ర ప్రభావం చూపుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరు రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని డాక్లర్లు సూచిస్తున్నారు. ఆహారం వేడివేడిగా ఉన్నప్పుడే తినాలని, ఆకుకూరలు, గుడ్లు, పాలు, పప్పుల వంటివి అధికంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. చలికాలంలో పొగమంచు అధికంగా ఉన్న సమయంలో చాలా మంది వ్యాయామం, నడక వంటివి తెల్లవారుజామున చేస్తుంటారు. ఇలా చేయడంతో లాభం కంటే నష్టమే ఎక్కువని, చలి, మంచు లో నడక శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అవకాశం ఉన్న వారు ఉదయం తొమ్మిది గంటల తర్వాతనే బయటకు రావాలని, సాయంత్రం 5 గంటల లోపు ఇండ్లకు చేరుకోవాలని చెబుతున్నారు.

ప్రయాణాలకు తప్పని వెతలు..

ఉదయం వేళల్లో రహదారులన్నీ పొగమంచు కప్పుకోవడం తో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి రోజూ ఉదయం నుంచే చల్లటి గాలలు మొదలవుతుండగా సాయంత్రం 6 గంటల తర్వాత చలి తీవ్రత క్రమ క్రమంగా పెరుగుతోంది. దీంతో త్వరగానే పనులు ముగించుకుని ఇంటికే పరిమితమవుతున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ రోడ్లపై పనిచేసే పారిశుధ్య కార్మికులు, పాల వ్యాపారులు, పేపర్‌ బాయ్స్ పడుతున్న బాధలు వర్ణనాతీతంగా మారగా, వారు చలి నుంచి ఉపశమనం పొందేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.


Similar News