Dharna of police family : రాష్ట్రంలో ఒకే పోలీసు విధానం కోసం రోడ్డెక్కిన పోలీస్ కుటుంబాలు

రాష్ట్రంలోని పోలీస్ అందరికీ ఒకే విధానం ఉండాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కొండాపూర్ సిగ్నల్ వద్ద 8 వ బెటాలియన్ పోలీసుల భార్యలు, వారి కుటుంబ సభ్యులు ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు.

Update: 2024-10-25 16:29 GMT

దిశ, శేరిలింగంపల్లి : రాష్ట్రంలోని పోలీస్ అందరికీ ఒకే విధానం ఉండాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కొండాపూర్ సిగ్నల్ వద్ద 8 వ బెటాలియన్ పోలీసుల భార్యలు, వారి కుటుంబ సభ్యులు ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. రాష్ట్రంలో ఒకే పోలీసు విధానం ఉండాలని డిమాండ్ చేశారు. మా భర్తలకు ఇష్టారీతిగా డ్యూటీలు వేసి మాకు, మా కుటుంబాలకు దూరం చేస్తున్నారని పోలీసుల భార్యలు అవేదన వ్యక్తం చేశారు. మా భర్తలను బెటాలియన్ లోపల కూలీ పనులు చేయిస్తున్నారని, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చేపిస్తున్నారని వారు ఆందోళనకు దిగారు. పోలీసు డ్యూటీకి మా భర్తలు చేస్తున్న పనికి సంబంధం లేదని పోలీసుల భార్యలు మండిపడ్డారు. ఇంటికి అప్పుడప్పుడు వచ్చే తండ్రిని చూసి తమ పిల్లలు బంధువులు గా ఫీల్ అవుతున్నారని, ఇంకొన్నాళ్లు పోతే తండ్రికి, పిల్లలకు సంబంధం లేకుండా పోతుందేమోనని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగా లేకున్న హస్పటల్ కు తీసుకోని పోయే పరిస్థితి లేదని, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ఉన్న పోలీస్ విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు పరచాలని డిమాండ్ చేశారు. తమ భర్తల డ్యూటీ విషయంలో ఇటీవల పోరాటానికి దిగిన కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులను అరెస్టు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలన్నారు. కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల ధర్నాతో గచ్చిబౌలి కొండాపూర్ రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైటెక్ సిటీ మీదుగా వచ్చే ట్రాఫిక్ ని కొత్తగూడ కొండాపూర్ ఫ్లై ఓవర్ మీదుగా దారి మళ్లించారు. ధర్నా చేస్తున్న బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలతో సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ అనుచితంగా వ్యవహరించారని 8వ బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమను ఫోటోలు తీస్తూ లోపలికి రండి మీ పని చెబుతా, మీకు పిచ్చి పట్టిందా అంటూ ఇన్స్పెక్టర్ దుర్భాషలాడారని ఆందోళన చేపట్టిన బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.


Similar News