Naredco Property show : నామికే వాస్తేగా నరెడ్కో ప్రాపర్టీ షో…తొలిరోజు అంతంత మాత్రంగానే స్పందన

హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో శుక్రవారం ప్రారంభమైన 14వ ఎడిషన్ నరేడ్కో ప్రాపర్టీ షో వెలవెలబోయింది.

Update: 2024-10-25 14:42 GMT

దిశ, శేరిలింగంపల్లి : హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో శుక్రవారం ప్రారంభమైన 14వ ఎడిషన్ నరేడ్కో ప్రాపర్టీ షో వెలవెలబోయింది. బిల్డర్లు, రియల్టర్లు పెద్దగా ఆసక్తి కనబర్చక పోవడం, ప్రస్తుతం మార్కెట్లో రియలేస్టేట్ కు పెద్దగా డిమాండ్ కూడా లేకపోవడంతో నరేడ్కో షోకు పెద్దగా జనాలు హాజరు కాలేదు. ఈ ప్రాపర్టీ షోకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రియలేస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని, పాలనాపరమైన అభివృద్ధి ఇకపై సులభతరం చేస్తామని అన్నారు. ఇప్పటికే అనుమతులు పొందిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

క్రెడాయి, ట్రెడాలు ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకు రావాలని, సమస్యల పరిష్కారానికి కమిటీతో చర్చలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని, రాష్ట్ర అభివృద్ధిలో రియల్టర్లు, బిల్డర్లు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి స్పష్టత ఉందన్న ఆయన హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్ లో రూ.10,000 కోట్లు కేటాయింపు చేశామని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంతో నగరాభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు.

రీజినల్ రింగ్ రోడ్ తో పాటు కనెక్టివిటీ రోడ్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామని, ట్రాఫిక్ క్రమ బద్దీకరణకు చర్యలు తీసుకుంటున్నామని, మెట్రో విస్తరణ వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. త్రాగు నీటి సామర్థ్యం పెంపు అంశం కేబినెట్ పరిశీలనలో ఉందని, రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, అలాగే అంతర్జాతీయ స్థాయిలో క్రీడా విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేస్తునట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.


Similar News