ఢిల్లీలో తెలంగాణ పాలిటిక్స్ చర్చించనున్న ఏఐసీసీ.. కేసీని కలిసిన పీసీసీ ఫ్యామిలీ

ఢిల్లీలో తెలంగాణ పాలిటిక్స్‌పై హాట్ హాట్‌గా రివ్యూలు కొనసాగుతున్నాయి.

Update: 2024-10-25 16:49 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీలో తెలంగాణ పాలిటిక్స్‌పై హాట్ హాట్‌గా రివ్యూలు కొనసాగుతున్నాయి. ఏఐసీసీ జనరల్ సెక్రటరీని పీసీసీ చీఫ్​మహేష్​ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా తన ఫ్యామిలీ మెంబర్లతో కలిశారు. తనకు పీసీసీ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం 30 నిమిషాలు పాటు తెలంగాణ రాజకీయాలపై చర్చించారు. పీసీసీ నూతన కార్యకవర్గం, ఎమ్మెల్సీ ఎన్నికల అంశాలపై చర్చించినట్లు సమాచారం. దీంతో పాటు కుల గణన అంశాన్ని కూడా కేసీ వేణుగోపాల్ ఆరా తీసినట్లు తెలిసింది.

ప్రభుత్వం గత పది నెలలుగా చేపట్టిన 6 గ్యారంటీలు, రుణ మాఫీ, ఉద్యోగాల నియామకాలు, స్పోర్ట్స్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాట్లు, విదేశీ పెట్టుబడులు తదితర అంశాలను కేసీకి వివరించారు. పార్టీ యాక్టివిటీస్, నేతల పనితీరు‌పై కూడా చర్చించారు. ఇక జీవన్‌రెడ్డి ఎపిసోడ్‌పై కూడా చర్చించినట్లు తెలిసింది. జీవన్‌రెడ్డి రాసిన లేఖపై కూడా కేసీ అడిగి తెలుసుకున్నారు. పార్టీలో సమన్వయం, సమర్ధత వంటివి అవసరమని కేసీ మహేష్‌కుమార్ గౌడ్‌కు సూచించారు. నేతలందరితో కో-ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించాలని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రాష్ట్ర పీసీసీ చీఫ్‌కు సూచించారు. పార్టీ అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత 50 రోజుల పాటు నిర్వహించిన పార్టీ ప్రోగ్రామ్స్‌పై కూడా కేసీ ఆరా తీశారు.

ముఖ్య నేతలతో భేటీ..

ఇక శనివారం కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు రాసిన బుక్ ఆవిష్కరణకు పీసీసీ చీఫ్​హాజరు కానున్నారు. ఆ మీటింగ్ తర్వాత పలువురు ఏఐసీసీ అగ్రనేతలను మహేష్​కుమార్ గౌడ్ కలవనున్నారు. అదేవిధంగా తెలంగాణ నుంచి మహరాష్ట్రకు వెళ్లి పనిచేస్తున్న కార్యకర్తల గురించి హైకమాండ్ వివరించనున్నారు. మరోవైపు కొత్త పీసీసీ నియామకం తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలి. వైస్ ప్రెసిడెంట్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ఆఫీస్ బేరర్లు, ఆర్గనైజేషన్ మెంబర్లు, పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ తదితర నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలి. స్టేట్ ఆఫీస్ గాంధీ భవన్ నుంచి జిల్లా స్థాయి‌లో కమిటిలన్నీ కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం పార్టీ పవర్‌లో ఉంది. పార్టీ, ప్రభుత్వంతో సంపూర్ణమైన సమన్వయంతో పని చేసే వ్యక్తులనే ఎంపిక కేసీ పీసీసీ చీఫ్‌కు ఆదేశాలిచ్చారు.

ప్రతిపక్షాలపై స్పీడ్ పెంచాలి.. అవసరమైతే బెంగళూరు టీమ్‌లు

త్వరలో తెలంగాణ‌లో ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీ‌కి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నదని కేసీ వేణుగోపాల్ పీసీసీకి వివరించారు. ప్రతిపక్షాలు సోషల్ మీడియా ద్వారా అర్ధ రహిత, అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, దీన్ని వెంటనే అడ్డుకోవాలని మహేష్​ కుమార్ గౌడ్‌కు సూచించారు. సోషల్ మీడియా టీమ్‌లకు మరింత యాక్టివ్‌గా తయారు చేయాలన్నారు. అవసరమైతే బెంగళూరు‌లోని ఏఐసీసీ సోషల్ మీడియా టీమ్‌ల సహకారాన్ని తీసుకోవాలని కేసీ పీసీసీ‌కి సూచించారు. గాంధీ భవన్ వార్ రూమ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన కేసీ.. ఎన్నికల టాస్క్ తరహాలోనే పని చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. 


Similar News