సోమవారం వరకు సర్టిఫికెట్స్ ఇచ్చేయాలి.. బాసర ట్రిపుల్ ఐటీకి హైకోర్టు ఆదేశం

ఏడాదిన్నరగా తనకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో సామల ఫణి కుమార్ అనే విద్యార్థి ఇటీవలే హైకోర్టును ఆశ్రయించాడు.

Update: 2024-10-25 17:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఏడాదిన్నరగా తనకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో సామల ఫణి కుమార్ అనే విద్యార్థి ఇటీవలే హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో హైకోర్టు గురువారం బాసర ట్రిపుల్ ఐటీకి నోటీసులు జారీ చేసింది. కాగా, సదరు విద్యార్థికి తన సర్టిఫికెట్లను సోమవారం నాటికి ఇచ్చేయాలని శుక్రవారం హైకోర్టు ఆదేశించింది. మంగళవారం ఈ విషయాన్ని కోర్టుకు తెలపాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం, విద్యా సంస్థలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలిపివేసిందని, అందుకే బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యం విద్యార్థుల సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం సరి కాదని తెలంగాణ హైకోర్టు చురకలంటించింది. ఇదిలా ఉండగా ఈ కేసును హైకోర్టు అడ్వొకేట్ తక్కురి చందన ఉచితంగా వాదించినట్లు ఫణికుమార్ తెలిపారు.

ఏడాదిన్నర పాటు అధికారుల చుట్టూ తిరిగా: విద్యార్థి ఫణి కుమార్

ఏడాదిన్నరగా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని విశ్వవిద్యాలయ అధికారుల చుట్టు తిరిగాను. వైస్ చాన్సలర్, స్పెషల్ ఆఫీసర్, చివరికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధికారులను కూడా కలిశాను. కానీ, ఎవరూ స్పందించ లేదు. హేళన చేయడమే కాక ప్రభుత్వం కట్టాల్సిన ఫీజు మొత్తాన్ని నన్ను కట్టాలని డిమాండ్ చేశారు. దీంతో వెంటనే హైకోర్టును సంప్రదించాను. ఉచితంగా న్యాయస్థానం చేసిన హైకోర్టు అడ్వొకేట్ తక్కురి చందనకు కృతజ్ఞతలు. కోర్టు ద్వారా రెండురోజుల్లో ఆర్డర్ వచ్చింది.


Similar News