రైతాంగ పోరాటాన్ని కొందరు రాజకీయాల కోసం వాడుకుంటున్నారు

రైతాంగ పోరాటాన్ని కొన్ని రాజకీయ పార్టీలు వారి స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నాయని సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు.

Update: 2024-09-07 10:59 GMT

దిశ, హిమాయత్ నగర్ : రైతాంగ పోరాటాన్ని కొన్ని రాజకీయ పార్టీలు వారి స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నాయని సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సాయుధ పోరాటంపై శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సాయుధ చరిత్ర పై మూడు భాషల్లో రూపొందించిన పుస్తకాన్ని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డితో కలిసి సురవరం సుధాకర్ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. హైదరాబాద్ సంస్థాన్ భారతదేశంలో విలీనం తర్వాత పోరాటం ముగిసిందని, ఇందులో ఎంతోమంది అసువులు బాసారని తెలిపారు.

    కమ్యూనిస్టులు, ప్రజా సంఘాలు, రైతుల పోరాటం ద్వారానే నిజాం తలొగ్గారని, కానీ అప్పటి కేంద్ర ప్రభుత్వం బలగాలతో లొంగినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. రైతాంగ సాయుధ పోరాటం హిందూ, ముస్లిం మధ్య జరిగిందని చరిత్రను వక్రీకరిస్తున్నారని, ఇది ఆధిపత్య వర్గానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం అని గుర్తు చేశారు. నిజాం కింద పని చేసిన వారిలో హిందువులు కూడా ఉన్నారన్నారు. సాయుధ పోరాటంలో ముస్లింలు కూడా భాగస్వామ్యులైనారని తెలిపారు. ఈ విషయం నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

    దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ సాయుధ పోరాటం ప్రారంభమైందన్నారు. కాగా ఆరోగ్యం క్షీణించినప్పటికీ ఆక్సిజన్ పెట్టుకొని సురవరం కార్యక్రమానికి హాజరయ్యారు. మరో కార్యక్రమానికి పాల్గొనక పోవచ్చునని సురవరం భావోద్వేగానికి గురయ్యారు. మజ్లీస్, బీజేపీలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి సాయుధ పోరాటాన్ని వాడుకున్నారని చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఈటీ నరసింహ, ఎస్. ఛాయా దేవి, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News