ఆదేశాలు బేఖాతారు.. ఉన్నత అధికారులపై సఫాయి కర్మచారిల ఫైర్

జీహెచ్ఎంసీ పరిధిలో క్షేత్ర స్థాయి విధులు నిర్వర్తించే కార్మికుల కష్టార్జితంతోనే నగరానికి పలు అవార్డులు వస్తున్నాయి.

Update: 2023-03-30 07:03 GMT

దిశ, సిటీ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో క్షేత్ర స్థాయి విధులు నిర్వర్తించే కార్మికుల కష్టార్జితంతోనే నగరానికి పలు అవార్డులు వస్తున్నాయి. కానీ ఆ కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై విచారణ చేపట్టాలంటూ జాతీయ కమిషన్లు ఆదేశించినా, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని పలు ఉద్యోగ, కార్మిక సంఘాలు మండి పడుతున్నాయి. జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగంలో వివిధ కారణాలతో విధుల నుంచి తొలగించిన పన్నెండు మంది కార్మికులను విచారించి, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జాతీయ సఫాయి కర్మచారి జారీ చేసిన ఆదేశాలను అమలు కాకపోవడం విమర్శలకు తావిస్తుంది.

వివిధ కారణాలతో విధుల నుంచి తొలగించబడిన 12 మంది కార్మికులు బీజేపీ మజ్దూర్ మోర్చను ఆశ్రయించడంతో ఆ యూనియన్ డిసెంబర్ 23, 2021లో సఫాయి కర్మచారి కమిషన్‌కు లేఖ రాసింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన సఫాయి కర్మచారి కమిషన్ ఈ వ్యవహారంపై జీహెచ్ఎంసీ కమిషనర్ తగిన విచారణ చేసి, తమకు నివేదికను పంపాలని గత సంవత్సరం జనవరి 14న జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌కు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆదేశాలు అంది నేటికీ 15 నెలలు గడుస్తున్నా, జీహెచ్ఎంసీ ఆ కార్మికుల వ్యవహారంపై కనీసం విచారణ కూడా చేపట్టలేదు. జాతీయ కమిషన్ ఆదేశాలను పట్టించుకోకుండా నివేదికను కూడా సమర్పించకపోవటం పట్ల జీహెచ్ఎంసీలోని పలు ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

మళ్లీ ఫిర్యాదు చేసే అవకాశం

కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేసే జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ ఆదేశాలను జీహెచ్ఎంసీ బుట్టదాఖలు చేయటంపై మరోసారి కమిషన్ కు ఫిర్యాదు చేసే అవకాశాలున్నట్లు తెలిసింది. త్వరలోనే బీజేపీ మజ్దూర్ మోర్చా సిటీ చైర్మన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ఊదరి గోపాల్ నేతృత్వంలో 12 మంది కార్మికులు కమిషన్ ను ఆశ్రయించి తమ గోడు చెప్పుకునేందుకు ఏప్రిల్ 6న హస్తినాకు పయనమవుతున్నట్లు సమాచారం.

Tags:    

Similar News