చరిత్ర చదవడం ద్వారా భవిష్యత్ తరాలకు పునాదులు వేసుకోవచ్చు : సీఎం

చరిత్రను చదివడం ద్వారా భవిష్యత్ తరాలకు పునాదులు వేసుకోవచ్చని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2024-12-19 15:55 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో / రాంనగర్ : చరిత్రను చదివడం ద్వారా భవిష్యత్ తరాలకు పునాదులు వేసుకోవచ్చని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు సమాజం అధునాతన యుగం వైపు పయనిస్తోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడం తో డిజిటల్ యుగం కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు రకరకాల మాధ్యమాలు వచ్చి పుస్తకాలు, వాటికి ఉన్న ప్రాధాన్యత తగ్గిస్తోందన్నారు. గురువారం ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2024 ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కవుల, కళాకారుల పేర్లు బుక్ ఫెయిర్ లో వేదికలకు పెట్టడం ద్వారా ఇక్కడికి వచ్చే పుస్తక ప్రియులకు సందేశం ఇవ్వాలన్న నిర్వాహకుల ఆలోచన అభినందనీయమన్నారు. ఉమ్మడి ఏపీ శాసనసభకు తెలంగాణ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించి చర్చ పెట్టినప్పుడు చరిత్రలో ఎప్పుడు గెలిచిన వారు రాసేదే చరిత్రగా ఉంటుంది, కానీ పోరాటంలో అసువులు బాసిన వారు , పోరాటంలో అమరులైన వారి గురించి చరిత్రలో కొంత నిర్లక్ష్యం, కొంత సమాచార లోపం ఉంటుందని, అది సాయుధ రైతాంగ పోరాటమైనా , తొలి తెలంగాణ ఉద్యమమైనా , మలి తెలంగాణ ఉద్యమమైనా, ఉద్యమంలో సమిదలైన, అమరులైన వారి చరిత్ర కంటే రాజకీయ ప్రయోజనం పొందిన వారి గురించే ఎక్కువగా చర్చ జరుతున్నదని తాను మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు . ఇవి నేను సొంతంగా మాట్లాడిన మాటలు కాదు, నేను చదివిన పుస్తకాల నుండి, మమ్మల్ని చైతన్యం చేసిన గానం నుండి క్రోడీకరించి నాడు సభలో మాట్లాడడం జరిగిందన్నారు.

ఒకవేళచరిత్ర కారులు వాస్తవాలు, చరిత్రలో లిఖించకపోతే వారికి అన్యాయం జరుగుతుందన్నారు. అందుకే తెలంగాణ కవులు, కళాకారులు తమ కళాలకు పదును పెట్టాలని , తమ గళాలను విప్పవలసిన అవసరం ఉందన్నారు. ఎక్కడైతే పరపీడ , దోపిడి, ఆధిపత్యం ఉంటుందో ఆ ప్రతి ప్రాంతాన్ని మనం తెలంగాణ అనొచ్చన్నారు. తెలంగాణలో జరుగుతున్నది కూడా ఆధిపత్యం దోపిడేనని సీఎం అన్నారు. ఈ రకమైన సందర్భంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో 1985 లో చిన్నగా మొదలు పెట్టి ఈ రోజు రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమం తీసుకోవడం అభినందనీయమన్నారు. మనం చరిత్ర చదువుకుంటేనే భవిష్యత్ కు సరైన దశ, దిశను నిర్ధారించుకోగలమనే సందేశం ఈ వేదిక ద్వారా చేరవేయ వలసిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. కచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేరువకావలసిన ఇలాంటి కార్యక్రమాలను తప్పకుండా ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తన సహచర మంత్రులతో పాటు తాను కూడా పాల్గొనడం ద్వారా సామాజిక బాధ్యత నెరవేర్చినట్లవుతుందన్నారు. చాలా సందర్భాల్లో తొంబై శాతం యాంత్రికంగా , రాజకీయ అవసరాలకు అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి, ఇలాంటి కార్యక్రమాలు సామాజిక స్పృహతో , చైతన్యంతో ఈ సమాజంలో వస్తున్న మార్పు మంచిదా, చెడ్డదా, ఆ మార్పు సమాజానికి ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుందనేది విశ్లేషించుకోవడానికి పనికొస్తుందన్నారు. ఇక్కడ ఎంత సమాచారం, విజ్ఞానం ఉందో కొత్త తరానికి తెలియదన్నారు.

కొత్త తరానికి తెలిసిందల్లా గూగుల్ ఒక్కటే. అందులో వచ్చే సమాచారమే నిజమనుకుంటారు, అందులో ఎవరో ఒకరు పెట్టిన సమాచారాన్నే వారు చదువుతున్నారని, అది నిజమో, అవాస్తవమో తెలియని భ్రమలో వారు ఉన్నారన్నారు. ఎప్పుడు కూడా చరిత్రకారులు రాసిన పుస్తకాలు చదవడం ద్వారా చరిత్రలో కనుమరుగైన గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని తాను సంపూర్ణంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. పోరాడి అమరులైన వారి గురించి ఎవరో ఒకరు చరిత్రకారులు రాస్తే తప్ప తెలియని పరిస్థితులు ఉన్నాయన్నారు. గెలిచిన వారు తమ గురించి గొప్పగా రాసుకుంటారు, రాసే వాళ్లు, రాయించే వారు వారికి అనుకూలంగా ఉంటారు. దీనినే నిజమైన చరిత్ర అని భ్రమలు కల్పించే విధంగా మనం కండ్ల ముందు పది సంవత్సరాలు చూశామన్నారు. చరిత్రకారులను గుర్తించుకోవడం కోసమే తెలుగు యూనివర్సిటీ కి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకున్నామన్నారు. ఆయన నాడు నిజాం ప్రభువులకే వ్యతిరేకంగా పోరాటం నడిపారన్నారు. కాళోజీ, దాశరథి వంటి వారే కాకుండా చరిత్రలో ఎంతో మంది కవులు, కళాకారులు స్పూర్తినిచ్చారని సీఎం అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా అందెశ్రీ, గద్దర్, గోరటి వెంకన్న, బండియాదగిరి, గూడ అంజయ్య వంటి ఎంతోమంది కవులు వారి సాహిత్యం ద్వారా పోరాటాలను నిర్మించి తెలంగాణ ప్రజలలో స్పూర్తిని నింపారన్నారు.

ఇలాంటి పుస్తక ప్రదర్శనలు భవిష్యత్ తరాలకు మన చరిత్రను చేరవేయడానికి ఉపయోగపడతాయన్నారు. నిజమైన చరిత్రను రానున్న తరాలకు చేరవేయడానికి చేస్తున్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం సముచితమైన గౌరవం ఇస్తుందని పేర్కొన్నారు. బుక్ ఫెయిర్ కు శాశ్వత కార్యాలయం, పుస్తకాలు విడుదల చేసేందుకు అవసరమైన వసతులు, పుస్తక ప్రదర్శన చేసుకోవడానికి వెసులుబాట్లు, వసతులకు సంబంధించి పూర్తి వివరాలు ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం నివేదకను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని కోరారు. ప్రభుత్వం తప్పకుండా ఆయా అంశాలను పరిశీలిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ , ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండ రాంరెడ్డి, బాల్మూర్ వెంకట్ , ప్రభుత్వ సలహా దారుడు వేం నరేందర్ రెడ్డి,గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియజ్ ,ప్రముఖ పాత్రికేయులు రామచంద్ర మూర్తి , జస్టిస్ సుదర్శన్ రెడ్డి, హైదారాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షులు ,కవి సంగమ వ్యవస్థాపకులు డాక్టర్ యాకుబ్ ,సీనియర్ పాత్రికేయులు ప్రొ రమా మెల్కొటే ఆర్. వాసు, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి కందాడి బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News