అధికారుల నిర్లక్ష్యం.. మట్టిలో కలిసిపోతున్న పురాతన పట్టణాలు..

అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిజాం కాలం నాటి పురాతన

Update: 2024-09-19 10:54 GMT

దిశ,సికింద్రాబాద్: అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిజాం కాలం నాటి పురాతన వారసత్వ కట్టడాలు మట్టిలో కలిసిపోతున్నాయి. సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఆక్రమణదారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. తార్నాక డిజన్ లాలాపేట ప్రధాన రహదారి పక్కనే నిజాం కాలం నాటి కమాన్ (దర్వాజా), దానికి ఆనుకుని బురుజు గోడలు ఉన్నాయి. కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం పురాతన కట్టడాలను కూల్చి వేస్తున్నారు. లాలాపేట కమాన్ (దర్వాజా) అంటేనే ఒక ల్యాండ్ మార్క్ గా చెప్తారు. అలాంటి వారసత్వ కట్టడాన్ని కూల్చి వేస్తూ రెండు నిర్మాణాలు సాగుతున్నాయి.

నిర్మాణాలకు ప్రధాన రహదారికి మధ్యలో బురుజు గోడ ఉండడంతో గోడను తొలగించి ప్రధాన రహదారి వైపు తమ నిర్మాణాలకు దారిని ఏర్పాటు చేసుకున్నారు.గోడ లోపల ఉన్న ఇళ్ల యజమానులకు బురుజు గోడ నుండి సెట్ బ్యాక్ తీసుకోవాలని ప్రభుత్వం చెబుతూ దానికి డబ్బులు కూడా చెల్లించారని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం రెండు నిర్మాణాలు గోడను కూల్చి కడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కూలిన గోడలని తిరిగి నిర్మించాల్సిన అధికారులు చోద్యం చూస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోడలు నిర్మాణదారులు కూల్చలేదని, అదే కూలిపోయిందని అధికారులు చెప్పడం గమనార్హం.

పట్టించుకోని రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు..

పురాతన కట్టడాలను కాపాడాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో కాల క్రమేనా ఆ కట్టడాలు కనుమరుగైపోతున్నాయి. ఆక్రమణదారుల బరితెగింపులతో నిజాం కాలం నాటి బురుజు గోడలు మట్టిలో కలిసిపోతున్నాయని పలువురు మండిపడుతున్నారు. అధికారులు మాత్రం గోడలు నిర్మాణదారులు కూల్చలేదని, అదే కూలిపోయిందని చెప్తున్నారు. కూలిన గోడను తిరిగి నిర్మించాలని పలువురు రెవెన్యూ అధికారులకు విన్నవించినా ఫలితం లేదన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్య సమాధానాలు చెప్తున్నారని పలువురు వాపోతున్నారు.

గోడను తిరిగి నిర్మించాలి: స్థానికులు

పురాతన బురుజు గోడను తిరిగి నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వారికి అడ్డుగా ఉందని నిర్మాణదారులు కూల్చినప్పటికి, అదే కూలిపోయిందని అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెవెన్యూ అధికారులు , జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయ లోపంతో సమస్య పెరిగిపోతుందన్నారు. తక్షణమే రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి గోడను నిర్మించాలని డిమాండ్ చేశారు.


Similar News