ముస్లింలను బయటకు పంపండి.. గవర్నర్‌కు బీజేపీ ఎస్టీ మోర్చా రిక్వెస్ట్

రాష్ట్రంలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో వందలాది ముస్లిం కుటుంబాలు నివాసముంటున్నాయని, 1/70 చట్టం నిబంధనల ప్రకారం అక్కడ ఆదివాసీ, గిరిజనులు మాత్రమే నివసించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న ముస్లిం

Update: 2024-09-19 16:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో వందలాది ముస్లిం కుటుంబాలు నివాసముంటున్నాయని, 1/70 చట్టం నిబంధనల ప్రకారం అక్కడ ఆదివాసీ, గిరిజనులు మాత్రమే నివసించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న ముస్లిం కుటుంబాలను ఖాళీ చేయించి మైదాన ప్రాంతాలకు పంపాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు బీజేపీకి చెందిన ఎస్టీ మోర్చా ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. గిరిజనేతరులు అక్కడ నివాసం ఉండడంతో ఆదివాసీ, గిరిజనుల హక్కుల భంగం వాటిల్లుతున్నదని, పీసా చట్టం నిబంధనలకు ఇది విరుద్ధమన్నారు. ముస్లి, కుటుంబాలు అక్కడ ఉండడం ద్వారా ఆదివాసీ, గిరిజనులకు భద్రత లేకుండా పోయిందని, ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో ఇటీవల ఆదివాసీ మహిళపై జరిగిన దాడిని గవర్నర్‌కు వివరించింది. ఆ జిల్లాలో దాదాపు 500కు పైగా ముస్లిం కుటుంబాలు నివాసముంటున్నాయని, వ్యాపారాలు చేసుకుంటున్నాయని తెలిపింది. అక్కడి గిరిజన, ఆదివాసీ మహిళలను లవ్ జిహాద్ పేరుతో ముస్లిం కుటుంబాల్లోని వ్యక్తులు వివాహం చేసుకుంటున్నారని, అక్కడి కుటుంబాలపై ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారని ఎస్టీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ కల్యాణ్ నాయక్ పేర్కొన్నారు.

ఈ కారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో భూములపై గిరిజనులకు, ఆదివాసీలకు ఉన్న హక్కులకు విఘాతం కలుగుతున్నదని, ముస్లిం ఫ్యామిలీస్ భూ కబ్జాలకు పాల్పడుతున్నాయన్నారు. ఆదివాసీ, గిరిజన మహిళలను పెండ్లి చేసుకున్న ముస్లింలు ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలను, ఇండ్లను పొందుతున్నారని తెలిపారు. చివరకు గిరిజన సాంప్రదాయాలను కూడా ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాలపై గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు ఉన్నందున 1/70 చట్టంతో పాటు పీసీ చట్టాన్ని కూడా పకడ్బందీగా అమలు చేసేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. త్వరలోనే ఆసిఫాబాద్ జిల్లా జైనూరుకు వెళ్ళి ఆదివాసీ, గిరిజనులకు న్యాయం చేస్తానని, పీసా చట్టం అమలు అయ్యేటట్టు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


Similar News