రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు..మంచినీళ్లలా తాగేసిన మద్యం ప్రియులు
నూతన సంవత్సర వేడుకలలో మద్యం ఏరులై పారింది.
దిశ, హైదరాబాద్ బ్యూరో : నూతన సంవత్సర వేడుకలలో మద్యం ఏరులై పారింది. మద్యం అమ్మకాలతో ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం సమకూరింది. దీంతో రాష్ట్ర ఖజానాకు లచ్చిందేవి తెగ వచ్చి పడింది. డిసెంబర్ 31వ తేదీన రూ.282 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 30వ తేదీ రూ.402 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 వైన్స్ షాపులు, 1117 బార్ అండ్ రెస్టారెంట్ , పబ్స్ ద్వారా ఎక్సైజ్ శాఖకు ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.
రికార్డు స్థాయిలో..
ఎక్సైజ్‌శాఖ చరిత్రలోనే రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. మంగళవారం ఒక్కరోజులోనే సుమారు రూ.403 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి మరి. గడిచిన 5 రోజుల్లో మద్యం షాపుల నుంచి బెల్ట్‌షాపుల వరకూ కోట్ల విలువైన మద్యం చేరుకోగా.. డిసెంబర్ 28 నుంచి జనవరి 1 ఉదయం వరకు కేవలం 5 రోజుల్లోనే దాదాపు రూ.1,800 కోట్ల విలువైన మద్యం మందుబాబులు తాగేసినట్లు ఎక్సైజ్‌శాఖ వర్గాలు వెల్లడించాయి. గతంతో పోల్చితే ఈసారి మద్యం అమ్మకాలు భారీగా పెరిగినట్లు మద్యం షాపుల యాజమన్యాలు చెబుతున్నాయి.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆయా మద్యంషాపులకు ఇప్పటికే భారీగా మద్యం చేరగా, అక్కడి నుంచి బెల్ట్‌షాపులకు తరలిస్తున్నారు. ఏడాది చివరి రెండు రోజుల్లో తెలంగాణ గ్రామాలు, పట్టణాల్లోని దాదాపు ప్రతి గల్లీలో మద్యం ఏరులై పారిందంటే అతిశయోక్తి కాదు. ఇక జనవరి 1వ తేదీన కూడా సెలవు కావడంతో.. బుధవారం కూడా భారీగా మద్యం విక్రయాలు జరగనున్నాయి. డిసెంబర్ 30వ తేదీ ఒక్కరోజే మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం అక్షరాలా రూ.402.62 కోట్లు. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా 3,82,265 లికర్ కేసులు, 3,96, 114 బీర్ కేసులు అమ్మడైనట్టు గణాంకాలు చెబుతున్నాయి.
లిక్కర్ కంటే బీర్లే అత్యధికంగా అమ్ముడుపోతున్నాయట. ఇక డిసెంబర్ 31 రాత్రి మద్యం కొనుగోళ్లు మరింత జోరందుకున్నాయి. సాధారణంగా ఏటా డిసెంబర్ వచ్చిందంటే కొత్త ఏడాది సంబరాలు ముందే మొదలైపోతాయి. దాదాపు వారం ముందునుంచే మందుబాబులు ‘న్యూ ఇయర్ వీక్’ను మందుతో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మంగళవారం రాత్రి ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినప్పటికీ అర్ధరాత్రి నాటికి1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కావడం విశేషం.