Kishan Reddy: ఇంటి నుంచే ఉద్యమం ప్రారంభించాలి.. కిషన్ రెడ్డి కీలక పిలుపు

తెలుగు భాష(Telugu Language)ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఆ ఉద్యమం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పిలుపునిచ్చారు.

Update: 2025-01-04 10:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు భాష(Telugu Language)ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఆ ఉద్యమం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ(HICC)లో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ అంటూ పాడుకునే వారంతా ఒకే వేదికపైకి రావడం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని ఊరికే అనలేదు. తెలుగు భాష ప్రపంచంలోనే అత్యంత అందమైన భాషని అన్నారు. కానీ ప్రస్తుతం చాలామంది తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నారు. తెలుగు మాతృభాష అయి ఉండి తెలుగులో రాయలేకపోతున్నారు.. తెలుగు పదాలను కూడా ఇంగ్లీషులో రాస్తున్నారు. ఇది చాలా బాధాకరమని తెలిపారు. ఇంట్లో కూడా ఇంగ్లీషులో మాట్లాడే రోజులొచ్చాయి. అందుకే ఇప్పటి నుంచి తెలుగులోనే మాట్లాడుకుందామని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

నిజాం కాలంలో తెలుగు భాషపై అణచివేత కొనసాగింది.. ఉర్దూ మీడియం స్కూల్సే ఉండేవి... తెలుగు వాళ్లు అక్కడే చదువుకోవాల్సి వచ్చేది. అంత నిర్బంధంలో కూడా నాడు గ్రంథాలయోద్యమం, 'ఆంధ్ర మహాసభ' పేరిట తెలుగు భాషను పరిరక్షించుకునేందుకు అనేక పోరాటాలు సాగాయని గుర్తుచేశారు. ఇంగ్లీషు నేర్చుకుంటేనే ఉద్యోగం, అభివృద్ధి అనేది గత వలస పాలకులు అందించిన చీకటి వారసత్వమని చెప్పారు. దీన్ని మనం వదిలిచంచుకోవాలని అన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్య విధానంలో మాతృభాషకు పెద్దపేట వేశారని గుర్తుచేశారు.

Tags:    

Similar News