జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్ మహానగర వాసులకు అత్యవసరమైన సేవలు అందించే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం శనివారం రసాభాసగా జరుగుతోంది.

Update: 2024-07-06 07:06 GMT

దిశ సిటీ బ్యూరో: హైదరాబాద్ మహానగర వాసులకు అత్యవసరమైన సేవలు అందించే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం శనివారం రసాభాసగా జరుగుతోంది. ఉదయం 10:30 గంటలకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించగానే టాక్స్ కలెక్షన్ ఫుల్లు అభివృద్ధి నిల్ అంటూ బీజేపీ, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించరాదని బీఆర్ఎస్ ప్లకాడ్లతో పోటాపోటీగా మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన మేయర్ సమావేశాన్ని 15 నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి సభలో ప్రారంభించగానే మజ్లీస్, బీజేపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా జోక్యం చేసుకోవడంతో సభలో ఏం జరుగుతుందన్న అయోమయం నెలకొంది.

ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఒకరు ఒకరు తోచుకున్నారు. ఈ గలాటలో బీజేపీ, మజ్లీస్ కార్పొరేటర్లు దాడికి దిగినంత పని చేశారు. అంతలో మార్షల్స్ రంగ ప్రవేశం చేసి వారిని బయటికి పంపించే ప్రయత్నం చేయగా బీజేపీ కార్పొరేటర్లు మార్షల్స్ పై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత, సీనియర్ కాంగ్రెస్ లీడర్ డి.శ్రీనివాసు మృతి పట్ల మేయర్ సంతాప ప్రతిపాదనలు ప్రవేశపెట్టగా పలువురు కార్పొరేటర్లు వారు సేవలను కొనియాడిన తర్వాత సంతాప తీర్మానాన్ని ఆమోదించారు.

 

మీకు సిగ్గు లేదు.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది ఎవరు? : మేయర్

శనివారం ఉదయం 10:30 గంటలకు కౌన్సిల్ సమావేశాన్ని మేయర్ ప్రారంభించగానే బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులతో లేచి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించరాదని నినాదాలు చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది ఎవరు మీకు తెలియదా మీకు సిగ్గు లేదు అని మేయర్ గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


Similar News