తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త

క్రీడా రంగంలో తెలంగాణ ఆదర్శంగా ఉండేలా, ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా త్వరలోనే పకడ్బందీ స్పోర్ట్స్ పాలసీని రూపొందించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు.

Update: 2024-10-04 15:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: క్రీడా రంగంలో తెలంగాణ ఆదర్శంగా ఉండేలా, ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా త్వరలోనే పకడ్బందీ స్పోర్ట్స్ పాలసీని రూపొందించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయిలోనే మన పాలసీకి గుర్తింపు రావాలన్నారు. పన్నెండేండ్ల తర్వాత (2036లో) జరిగే ఒలింపిక్ పోటీలను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త పాలసీలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం తయారుచేసిన ముసాయిదా పాలసీపై సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన రివ్యూలో పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్శిటీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్నదని, ఇటీవల ఉనికిలోకి వచ్చిన స్కిల్స్ యూనివర్శిటీ తరహాలోనే ఇది కూడా పబ్లిక్ – ప్రైవేటు భాగస్వామ్యంతో పనిచేస్తుందని వివరించారు. స్వయంప్రతిపత్తితో ఫంక్షనింగ్ అయ్యేలా ప్రత్యేకంగా గవర్నింగ్ బాడీ ఉంటుందని, చైర్మన్ సహా సభ్యులు, కన్వీనర్, మెంబర్ సెక్రటరీ ఉంటారని తెలిపారు.

ప్రస్తుతానికి గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ స్టేడియంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ పనిచేస్తుందని, దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలోని ఈ ప్రాంగణంలో ఇప్పటికే వివిధ క్రీడలకు రెడీమేడ్ సదుపాయాలున్నాయని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అధునాతనంగా అప్ గ్రేడ్ చేసుకోవాలని సూచించారు. తొలుత 13 కోర్సుల్లో అడ్మిషన్లు ఉంటాయని వివరించారు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై అధికారులు ఇచ్చిన వివరాలను స్టడీ చేసిన సీఎం పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే విధంగా మన రాష్ట్ర క్రీడాకారులను ఈ యూనివర్శిటీ తీర్చిదిద్దాలని, ఆ సంకల్పంతోనే ఈ విధాన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. లక్ష్యం సాకారమయ్యే విధంగా అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ క్రీడల్లో ప్రతిభావంతులను గుర్తించటం మొదలు వారి చదువులకు ఆటంకం లేకుండా జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీలకు అవసరమైన ప్రావీణ్యం నేర్పించే క్రమంలో ఎదురయ్యే ఆటుపోట్లన్నీ పరిష్కరించేలా కొత్త పాలసీ ఉండాలన్నారు.

హైదరాబాద్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రముఖ క్రీడా మైదానాలు, స్టేడియంలను స్పోర్ట్స హబ్ పరిధిలోకి తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎల్బీ స్టేడియం, హకీంపేట స్పోర్ట్స్ స్కూల్, కోట్ల విజయ భాస్కరరెడ్డి ఇండోర్ స్డేడియం, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ సైక్లింగ్ వెలోడ్రమ్ లాంటివన్నింటినీ గుర్తించి ఒకే గొడుగు కిందకి తీసుకురావాలన్నారు. స్పోర్ట్స్ హబ్‌లో క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, అక్వాటిక్స్ లాంటి 14 క్రీడలను పొందుపరుస్తున్నట్లు తెలిపారు. మన ప్రాంతంలో ఉన్న భౌగోళిక పరిస్థితులతో పాటు యువతకు ఆసక్తి ఉన్న క్రీడలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. దేశ విదేశాల్లో ఉన్న కోచ్‌లను రప్పించాలని, అక్కడున్న యూనివర్సిటీల సహకారం తీసుకునేలా అవగాహనా ఒప్పందాలను చేసుకోవాలని సూచించారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలకు స్పష్టమైన విధానాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఏ స్థాయి పోటీల్లో విజయం సాధించిన క్రీడాకాలకు ఎంత ప్రోత్సాహాన్ని అందించాలి... ఎవరికి ఉద్యోగం ఇవ్వాలి... తదితర మార్గదర్శకాలను ఖరారు చేయాలని ఆదేశించారు. ముసాయిదాకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు మార్పులు చేర్పులను సూచించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, క్రీడలు, యువజన అభ్యున్నతి శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీం ఈ సమావేశంలో పాల్గొన్నారు.


Similar News