Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జ్ వీసీపై ఓయూ జేఏసీ నేతల సంచలన కామెంట్స్

Update: 2024-10-04 13:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బాసర ట్రిపుల్ ఐటీలో అక్రమాలకు ఆద్యుడు అని, ఇన్‌చార్జ్ విసి వెంకటరమణను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తొలగించి ట్రిపుల్ ఐటీని పరిరక్షించాలని ఓయూ జేఏసీ విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఓయూ జేఏసీ విద్యార్థి నేతలు వినోద్ కుమార్, పేరాల ప్రశాంత్ మీడియాతో మాట్లాడారు. బాసర ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జ్ విసి తనకు నచ్చిన వాళ్లకు అందలం ఎక్కిస్తూ నచ్చని వారికి అలాగే తనకు లొంగని వారికి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అలాగే ఇబ్బందులకు గురి చేసి వారి ఉద్యోగాలను కూడా తొలగించిన ఘనుడు వెంకటరమణ అని వారు తీవ్ర ఆరోపణలు చేశారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తను అనేక అక్రమాలు చేశారని, నేడు ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొంతమంది ఉన్నత విద్యాశాఖ ముఖ్య అధికారులతో పాత సంబంధాలను కొనసాగిస్తూ తన అక్రమాలను కప్పిపుచ్చుకుంటున్నారని ఆరోపించారు. పదేళ్లుగా ఏనాడు పాఠం చెప్పని వీసీ వెంకటరమణ పైరవీలతో పదవులు తెచ్చుకుంటూ ఉన్నత విద్యా మండలి లో ఏళ్లుగా అలాగే బాసర ట్రిబుల్ ఐటీ ఇన్‌చార్జిగా గత రెండున్నరేళ్లుగా కొనసాగుతూ అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు. అలాగే చేయని పనులకు నకిలీ బిల్లులు సృష్టించి మెస్ కాంట్రాక్టర్ల గడువు ముగిసిన కూడా అదే కాంట్రాక్టర్లను కొనసాగిస్తూ ముడుపులు తీసుకుంటున్నారని తెలిపారు. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు గురి చేయడమే కాకుండా ఉద్యోగాలను తొలగిస్తా అని బెదిరించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడుస్తున్నా వెంకటరమణ అక్రమాల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. మరోవైపు పేద విద్యార్థులకు చెందాల్సిన వర్సిటీ డబ్బులను ఆయన వ్యక్తిగతంగా వాడుకుంటూ వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీశారని తెలిపారు.

వెంటనే వెంకటరమణను తక్షణమే ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్-2 అలాగే బాసర ట్రిపుల్ ఐటీ ఇన్ చార్జి విసి పదవులను తొలగించాలని డిమాండ్ చేశారు. గత 10 ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వంలో పని చేసిన అక్రమాల మీద ఏసీబీ లేదా విజిలెన్స్ ఎంక్వయిరీ వేసి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని యూనివర్సిటీల వీసీల పదవి కాలం గడిస్తే అందరిని తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం వెంకటరమణను ఎందుకు తొలగిస్తే లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. అలాగే వెంకటరమణ కాపాడుతున్న ఉన్నత విద్యాశాఖ అదృశ్య శక్తి బుర్ర వెంకటేశం మీద కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు చేపట్టాలన్నారు. లేదంటే విద్యార్థుల రాజీలేని పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నేతలు పల్స ఆంజనేయులు గౌడ్, ప్రవీణ్ కుమార్, రంజిత్ కుమార్, దిలీప్ కుమార్, సురేష్ కుమార్, రమేష్ యాదవ్, తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.


Similar News