ఫైనాన్షియర్ల వేధింపులు.. ఆటో డ్రైవర్ ఆత్మహత్య

ఫైనాన్షియర్ల వేధింపులు తాళలేక ఓ ఆటో డ్రైవర్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2023-09-08 16:11 GMT

దిశ, రాజేంద్రనగర్: ఫైనాన్షియర్ల వేధింపులు తాళలేక ఓ ఆటో డ్రైవర్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ పులి యాదగిరి కథనం ప్రకారం.. సులేమాన్ నగర్‌కు చెందిన మహమ్మద్ తోఫిక్ (25) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఇంట్లో ఉరి వేసుకున్నాడు. కుటుంబీకులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే తోఫిక్​ కుటుంబ అవసరాల నిమిత్తం ఫైనాన్సర్ వహీద్ పాషా వద్ద 65 వేల అప్పు తీసుకున్నాడు.

ఇటీవల అతడు తన స్నేహితుడైన షేక్ షకీల్ తో కలిసి డబ్బులు ఇవ్వాలని తోఫిక్‌ను తీవ్రంగా వేధించసాగారు. నేపథ్యంలోనే తన కుమారుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి తండ్రి మహమ్మద్ నబీ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న తోఫిక్ ఆత్మహత్యకు పాల్పడడంతో భార్యాపిల్లలు, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. శుక్రవారం అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Similar News