రేపటి 20–20 మ్యాచ్​కు ఏర్పాట్లు పూర్తి

భారత్ - బంగ్లాదేశ్ టి-20 మ్యాచ్ కు రాచకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Update: 2024-10-11 14:36 GMT

దిశ, సిటీక్రైం : భారత్ - బంగ్లాదేశ్ టి-20 మ్యాచ్ కు రాచకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉప్పల రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ కు 2600 మందితో భద్రత ఏర్పాటు చేసినట్టు పోలీసు కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. స్టేడియం వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని వాహనాల రాకపోకలపై స్టేడియానికి వచ్చి పోయే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. పలు చోట్ల మళ్లింపులను చేపట్టారు. మ్యాచ్ కు వచ్చే ప్రముఖులకు కేటాయించిన పాస్​ల మీద పార్కింగ్ తో పాటు వారు చేరుకోవాల్సిన గేటు వివరాలను పొందుపరిచారు.

     అదే విధంగా అసాంఘిక శక్తులపై నజర్ పెట్టడంతో పాటు మహిళల భద్రత కోసం షీ టీమ్స్ స్టేడియంలో ఉంటాయన్నారు. సాయుధ పోలీసులతో పాటు అక్టోపస్ సిబ్బంది భద్రతను అందిస్తారన్నారు. ప్రత్యేక కమాండ్ కంట్రోల్ ద్వారా స్టేడియంలోని అణువణువును జల్లెడ పడుతున్నట్లు తెలిపారు. స్టేడియంలో తినుబండారాలకు సంబంధించి అధిక రేట్ల విక్రయాలపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక పోలీసు టీంను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 39 వేల ప్రేక్షకుల సామర్ధ్యం ఉన్న స్టేడియంలో పోలీసు బందోబస్తు పటిష్టంగా ఉంటుందని సీపీ చెప్పారు. శుక్రవారం ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన స్టేడియంలోని భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. కాగా మొబైల్ ఫోన్ తనిఖీల కోసం ప్రత్యేకంగా టెక్నీషియన్ టీంలను పోలీసులు ఏర్పాటు చేశారు.

స్టేడియంలోకి వీటికి అనుమతి లేదు

లాప్ టాప్స్, కెమెరాలు, మ్యాచ్ బాక్స్, బైనాక్యూలర్స్, బ్యాటరీలు, బ్యాగ్స్, బ్యానర్స్, సిగరెట్లు, లైటర్స్, కాయిన్స్, హెల్మెట్స్, బయటి తినుబండారాలు, వాటర్ బాటిల్స్, ఎలక్ట్రిక్ పరికరాలు, పదునైన వస్తువులు, పెన్స్, పెర్ఫ్యూమ్స్ లను స్టేడియలోకి అనుమతించరు. 

Tags:    

Similar News