బంజారాలను గుర్తించండి.. మాజీ ఎంపీ సీతారాంనాయక్ విజ్ఞప్తి
బంజారాలకు కేబినెట్‌లో ఎందుకు చోటు కల్పించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ ఎంపీ సీతారాంనాయక్ ప్రశ్నించారు...
దిశ, తెలంగాణ బ్యూరో: బంజారాలకు కేబినెట్‌లో ఎందుకు చోటు కల్పించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ ఎంపీ సీతారాంనాయక్ ప్రశ్నించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బంజారా ప్రజల కోసం రాష్ట్రంలో ఒక్క మంత్రిని కూడా రేవంత్ నియమించకపోవడంపై ఆయన ఫైరయ్యారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలవబడుతున్న బంజారాలు రాజ్యాంగ ఫలాలకు దూరమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం బంజారాలను రాజ్యాంగంలో చేర్చకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని విమర్శలు చేశారు. మైథిలి, కొంకిణి, కోడ భాష మాట్లాడే కోటి మందిని 8వ షెడ్యూల్డ్‌లో చేర్చారన్నారు. 12 కోట్ల మంది మాట్లాడే బంజారా భాషని 8వ షెడ్యూల్డ్ లో చేర్చాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా పట్టించుకోలేదని పేర్కొన్నారు. ప్రధాని మోడీ బంజారాల ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం సేవాలాల్ మహరాజ్ విగ్రహాలను కూడా పెట్టడం లేదన్నారు. రాష్ట్రంలో బంజారాల తరపున మోడీకి సహకరిస్తామని, బీజేపీ సభ్యత్వాలను నమోదు చేయిస్తామని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని 50 లక్షల బంజారా గిరిజనులు ఉన్నారని, వారిని కాపాడే నాయకులను ఆదరించకపోతే బతుకులు ఇంకా బజారు పాలవుతాయని సూచించారు. గాలిలో దీపంలా కొట్లాడుతున్న బంజరా జాతిని గుర్తించిన మోడీకి సీతారాంనాయక్ ధన్యవాదాలు తెలిపారు.