ముంబాయి నుంచి కొకైన్...ప్లాస్టిక్ దుకాణం యజమాని అరెస్ట్

బెట్టింగ్ అలవాటుతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన వ్యాపారి డ్రగ్స్ దందా తో భారీగా సంపాదించుకుందామని స్కెచ్ వేసి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు దొరికిపోయాడు.

Update: 2025-01-02 15:27 GMT

దిశ, సిటీక్రైం : బెట్టింగ్ అలవాటుతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన వ్యాపారి డ్రగ్స్ దందా తో భారీగా సంపాదించుకుందామని స్కెచ్ వేసి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు దొరికిపోయాడు. అతని నుంచి 30 గ్రాముల కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెం.12 ప్రాంతానికి చెందిన జవహార్ కిషన్ గోపాల్ ప్లాస్టిక్ వ్యాపారం చేస్తున్నాడు. అతను బెట్టింగ్ మోజులో పడి ఆర్ధికంగా అప్పులపాలయ్యాడు. వాటి నుంచి బయటపడేందుకు అత్యవసరంగా డబ్బులు కావాలని ఆశపడ్డాడు. దీని కోసం స్నేహితులైన అనిల్, వరుణ్, ప్రమోద్ లను వేగంగా డబ్బు సంపాదించే సలహా ఇవ్వమని అడిగాడు.

దీంతో వారు డ్రగ్స్ దందా చేయమని చెప్పారు. నగరంలో డ్రగ్స్ కు చాలా డిమాండ్ ఉందని రెచ్చగొట్టారు. వీరి మాటలతో ప్రేరేపితుడైన కిషన్ గోపాల్ ముంబాయిలో ఓ నైజీరియన్ ను సంప్రదించాడు. అతని నుంచి 8 లక్షలు విలువ చేసే 30 గ్రాముల కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్ ను కొనుగోలు చేసి ముంబాయి నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చాడు. న్యూ ఇయర్ సందర్భంగా వీటిని అధిక ధరలకు అమ్మి డబ్బు సంపాదించాలని ప్లాన్ చేసుకున్నాడు. ఈ సమాచారం పోలీసులకు అందడంతో అతనిని గురువారం అరెస్టు చేసి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కోసం బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.


Similar News