బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి

తెలంగాణ ఆషాఢ మాస బోనాల దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు.

Update: 2024-07-06 12:03 GMT

దిశ, బేగంపేట : తెలంగాణ ఆషాఢ మాస బోనాల దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు. శనివారం బేగంపేట హరిత టూరిజం ప్లాజాలో బోనాల దశాబ్ది ఉత్సవాలు -2024 ఏర్పాట్లకు సంబంధించిన చెక్కులను దేవాలయాల కమిటీలకు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ తెలంగాణ బోనాల జాతర ప్రతి సంవత్సరం జరుగుతుందని, గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఆర్భాటంగా నిర్వహించాలని కోరారు. గతం కంటే ఎక్కువ నిధులు కేటాయించినట్టు చెప్పారు. ప్రభుత్వం 20 కోట్లు కేటాయించిందన్నారు.

     ఆగస్టు 1న గోల్కొండ శ్రీ జగదంబ మహంకాళి దేవాలయంలో బోనాలు, 4న కుంభహారతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హైదరాబాద్ సాంస్కృతి సంప్రదాయాలను దేశవ్యాప్తంగా గుర్తించేలా నిర్వహించాలని కోరారు. రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలు పడి మంచి పంటలు పండాలని ప్రజలంతా సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా ఏర్పాట్ల కోసం వివిధ దేవాలయాల కమిటీ సభ్యులకు చెక్కులను పంపిణీ చేశారు.

    బోనాల ఉత్సవ క్యాలెండర్ ( కాఫీ టేబుల్ బుక్) ఈవెంట్ క్యాలెండర్, ఉత్సవాల పోస్టర్, బోనాల పండుగ పై మామిడి హరికృష్ణ రాసిన పుస్తకం, బోనాల పండుగ పై పాట సీడీని మంత్రులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య, దేవదాయ శాఖ, సమాచార శాఖ కమిషనర్ హన్మంతరావు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటాచారి, వివిధ దేవాలయాల కమిటీ సభ్యులు, దేవదాయ శాఖ దీప్తి కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. 


Similar News