పాతబస్తీలో భగ్గుమన్న ముస్లిం సంఘాలు

మహ్మద్ ప్రవక్తపై యూపీకి చెందిన పూజా యతి నరసింహానంద చేసిన వ్యాఖ్యలపై పాతబస్తీలో ముస్లిం సంఘాలు భగ్గుమన్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎంఐఎం డీజీపీని కోరనుంది.

Update: 2024-10-05 04:49 GMT

దిశ, వెబ్ డెస్క్: ముస్లింలను, ఇస్లాం మతాన్ని కించపరిచేలా యూపీకి చెందిన ప్రముఖ పూజారి యతి నరసింహానంద చేసిన వ్యాఖ్యలపై పాతబస్తీలో ముస్లిం సంఘాలు భగ్గుమన్నాయి. యూపీలోని దాస్నాదేవి ఆలయంలో ఆయన పూజారిగా పనిచేస్తున్నారు. మహ్మద్ ప్రవక్తపై ఆయన చేసిన వ్యాఖ్యలపై నిరసన చేపట్టాయి. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో యతి నరసింహానందకు వ్యతిరేకంగా ముస్లింలు ప్రదర్శనలు, నిరసనలు చేస్తున్నారు. నరసింహానందపై చర్యలు తీసుకోవాలని ఎంఐఎం డీజీపీని కోరనుంది.

యతి నరసింహానంద ముస్లింలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆయన ముస్లింలను, ఇస్లాం మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి.. వివాదాల్లో చేరారు. నరసింహానందపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంపై మొహమ్మద్ జుబైర్ అనే ఫ్యాక్ట్ చెకర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా తాను యతి నరసింహానందపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నానని, ఇంతవరకూ ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పూజారి యతి నరసింహానంద.. మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ముస్లిం వర్గాలకు ఆగ్రహాన్ని తెప్పించాయి. ముస్లింలపై నరసింహానంద చేస్తున్న వ్యాఖ్యలకు అదుపులేకుండా పోయిందని, ప్రభుత్వం కూడా చోద్యం చూస్తూ కూర్చుందని దుమ్మెత్తిపోస్తున్నాయి ముస్లిం సంఘాలు. మరి దుమారం రేపుతోన్న యతి నరసింహానంద చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికై కేంద్ర, యూపీ ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయేమో చూడాలి. 


Similar News