బ‌ఫ‌ర్ జోన్‌లో ఆనంద హోమ్స్ నిర్మాణాలు

Update: 2024-10-05 07:24 GMT

దిశ, గండిపేట్ : గండిపేట్ మండల పరిధిలోని చెరువులు కబ్జాదారుల భారీనపడి అన్యక్రాంతం అవుతున్నాయి. అయినా ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీల అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని స్థానికులు తెలుపుతున్నారు. చెరువులను పరిరక్షించాల్సిన ఇరిగేషన్ అధికారులు తమకేమీ పట్టిందిలే అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. స్థానికంగా ఇరిగేషన్ శాఖ అధికారుల పనితీరుపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముడుపులకు అలవాటు పడిన ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ విభాగాలు చెరువులను కబ్జాలకు గురైనా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఏకంగా బఫ‌ర్ జోన్‌లో నిర్మాణాలలో చేపడుతున్నా వారు మౌనంగా చూస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు హైడ్రా ఇటీవల కబ్జాలకు గురైన చెరువులు, కుంటలు, తటాకాలను కాపాడే పనిలో ఉన్నప్పటికీ గండిపేట్ మున్సిపల్ పరిధిలో మాత్రం హైడ్రా అంతగా దూకుడు చూపడం లేదని స్థానికంగా వినిపిస్తున్న మాట. ప్రభుత్వం హైడ్రాను చెరువులు, కుంటలు, తటాకాలను కాపాడే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన హైడ్రా సైతం చెరువులు వద్ద చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవడానికి చొరవ చూపడం లేదని స్థానికులు అంటున్నారు.


గండిపేట (Gandipet) మండల పరిధిలోని ఆనంద హోమ్స్ నిర్వాహకులు బఫర్ జోన్ (buffer zone) లో నిర్మాణాలను చేపడుతున్నారు. మ‌ణికొండ మున్సిపాలిటీ(Manikonda Municipality) ప‌రిధిలోని నెక్నాంపూర్(Neknampur) స‌ర్వే నెంబ‌ర్లు 57, 58, 59, నార్సింగి మున్సిపాలిటీ ప‌రిధిలోని 93, 328 స‌ర్వే నెంబ‌ర్ల‌లోని చిన్న చెరువు ప‌రిధిలోని బ‌ఫ‌ర్ జోన్‌లో నిర్మాణాలు కొన‌సాగుతున్నాయి. అయినా ఇరిగేషన్, రెవెన్యూ(Irrigation, Revenue) అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ మేరకు ఎన్ని వార్త కథనాలు వచ్చినా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల ద్వారా ఉన్నత అధికారులకు, ప్రజా ప్రతినిధులకు సమాచారాన్ని చేరవేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నారు. ఇక సామాన్యులపై అధికారులు ప్రతాపం చూపడంలో వెనకకు తగ్గడం లేదని స్థానికులు అంటున్నారు. సామాన్యులపై కొరడా ఝులిపించే అధికారులకు ఆనందా హోమ్స్ బఫర్ జోన్లో నిర్మిస్తున్న నిర్మాణాలు కనిపించడం లేదా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల వ్యవహార శైలి ఆనందా హోమ్స్ కు అధికారులకు మధ్య ఒప్పందం కుదిరినట్టుగా ఉందని స్థానికులు తెలుపుతున్నారు. అందుకే చర్యలు చేపట్టకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.

హైడ్రా స్పందించేనా..?

హైడ్రా చర్యలు తీసుకోవాలని పలుమార్లు అధికారులను కోరినా చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు. అధికారులకు నచ్చితే ఓ తీరు.. న‌చ్చకపోతే మరో తీరు.. అన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. బఫర్ జోన్‌లో నిర్మాణాలు చేపడుతున్నా నోటీసులు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు ఎన్వోసీలు ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత పకడ్బందీగా బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపడితే ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పట్టించుకోనప్పటికీ హైడ్రా అయినా పట్టించుకుంటుందని ప్రజలు భావిస్తున్నారు. కానీ హైడ్రా సైతం చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రజలు మండిపడుతున్నారు. తక్కువ సమయంలో హైడ్రాకు మంచి గుర్తింపు వచ్చిన నేపథ్యంలో హైడ్రా ఈ నిర్మాణాలను ఎందుకు ఉపేక్షిస్తుందంటూ ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికైనా హైడ్రా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


అక్రమార్కులలో నమ్మి కొంటే అంతే...

అక్రమంగా అనుమ‌తులు పొందిన నిర్మాణాల‌ను ఓ ప‌క్క అధికారులు గుర్తించి కూల్చేస్తున్నారు. ఆ ప్లాట్‌ను గురించి ఎవ‌రికి తెలియ‌క‌పోతే కొనే వారి ప‌రిస్థితి ఎలా ఉంటుందోన‌నే సందేహాలను స్థానికులు వెల్లిబుచ్చుతున్నారు. కోట్ల రూపాయ‌లు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేయ‌డం, దాచుకున్న డ‌బ్బులు స‌రిపోక‌ హోమ్ లోన్లు తెచ్చి కొనే వారు ఈ నిర్మాణాల‌పై ఎలాంటి చ‌ర్యలు తీసుకుంటారంటూ ప్రజ‌లు ప్రశ్నిస్తున్నారు. బ‌ఫ‌ర్ జోన్‌లో నిర్మాణాలపై పూర్తి వివ‌రాలు తెలుసుకొని కొనుగోలు చేయాల‌ని స్థానికుల సూచ‌న‌లు చేస్తున్నారు. బ‌ఫ‌ర్ జోన్‌లో అమ్మకాలు జ‌రిపి వెళ్లిపోతే కొనే వారి ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించాల‌ని తెలుపుతున్నారు. ప్రతి కొనుగోలు దారుడు నిర్మాణాల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించి కొనుగోలు చేయాల‌ని సూచిస్తున్నారు. ఇక‌నైనా హైడ్రా అధికారులు స్పందించి చ‌ర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. ఈ నిర్మాణాల‌పై ఉన్నత స్థాయి అధికారులు, సీఎం దృష్టికి తీసుకుపోవ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని స్థానికులు చెబుతున్నారు.

Tags:    

Similar News