భూ భారతి అమలుకు వడివడిగా అడుగులు

భూ భారతి చట్టం అమలు చేసేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది.

Update: 2024-12-23 16:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : భూ భారతి చట్టం అమలు చేసేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. యాక్టులో పేర్కొన్నట్లుగా విలేజ్ అకౌంట్ నిర్వహించేందుకు ప్రతి ఊరికొక్కరు అనివార్యం. అందుకే విలేజ్ లెవెల్ ఆఫీసర్లను నియమించనున్నారు. ఐతే పూర్వపు వీఆర్వోలకు ఆప్షన్లు ఇస్తూ సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పటి వీఆర్వోలందరినీ లాటరీ పద్ధతిన వివిధ శాఖలకు, కార్పొరేషన్లకు బలవంతంగా పంపారు. కొందరినైతే తాత్కాలిక ఉద్యోగులుగా మార్చగా ఏండ్ల తరబడి ఎలాంటి వేతనం లేకుండా పని చేస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. కొత్త చట్టం ప్రకారం ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక విలేజ్ లెవెల్ ఆఫీసర్ ని నియమిస్తున్నట్లు సీసీఎల్ఏ ప్రకటించారు. ఎవరైతే తిరిగి రెవెన్యూ శాఖకు రావాలనుకుంటున్నారో వారందరికీ ఆప్షన్లు ఇచ్చారు. ఈ మేరకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ని అందించారు. https://docs.google.com/forms/d/e/1FAIpQLSdMb0_y0V7euTUq-cD4Xj5uiml1-QGALCiYeCB2T3TxU9ApLw/viewform ఈ ఫారం ద్వారా పూర్తి వివరాలను సమర్పించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇందులో విలేజ్ లెవెల్ ఆఫీసర్ లతో పాటు సర్వేయర్ గా పని చేసేందుకు కూడా చాన్స్ ఇచ్చారు. ఆప్షన్ల ద్వారా పూర్వపు వీఆర్వో పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నారు? ఏ శాఖలో పని చేస్తున్నారు? ఎంప్లాయ్ ఐడీ, ప్రస్తుత పోస్టులో నియమించబడిన తేదీ, రెవెన్యూ శాఖలో చేరిన తేదీ, విద్యార్హతలు, ఏ జిల్లా? ఏ జిల్లాలో పని చేయాలనుకుంటున్నారు? ఇలాంటి వివరాలను అడిగారు. సర్వేయర్ గా పని చేయాలనుకుంటే తప్పనిసరి డిగ్రీ లేదా ఇంటర్(ఎంపీసీ) చదివి ఉండాలన్న షరతు విధించారు. ఈ నెల 28వ తేదీలోపు ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు.

పొంగులేటి ప్రకటించినట్లుగానే..

మళ్లీ వీఆర్వో వ్యవస్థను తీసుకొస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. గతంలో వివిధ శాఖల్లోకి సర్దుబాటైన వీఆర్వోలు, వీఆర్ఎల్లో ఎంపికచేసిన వారిని మళ్లీ 10,954 రెవెన్యూ గ్రామాల్లో నియమిస్తామన్నారు. మరో వెయ్యి మందిని సర్వే సెటిల్మెంట్ విభాగంలోకి తీసుకుంటామని తెలిపారు. ఆర్వోఆర్ యాక్ట్ 2024 ప్రకారం తాత్కాలిక భూదార్, శాశ్వత భూదార్, భూదార్ కార్డుల జారీ, సాదాబైనామాల క్రమబద్ధీకరణ, దరఖాస్తుల పరిశీలన, వీలునామా, వారసత్వ విషయంలో మ్యుటేషన్ లో విచారణ, సెక్షన్ 13 ప్రకారం గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, నిర్ణయించిన రీతిలో హక్కుల రికార్డుల తుది ప్రచురణ తర్వాత అమలు చేయాలి. ధరణి పోర్టల్ లో తప్పొప్పుల సవరణతో పాటు అసలే నమోదు కాకుండా పార్టు బి కింద పేర్కొన్న సుమారు 18 లక్షల ఎకరాల డేటాను పరిశీలించి ఆ రైతులకు న్యాయం చేయాల్సి ఉంది. ప్రభుత్వం పార్టు బి కింద పేర్కొన్న వాటిని ఏబీసీడీ వర్గీకరణ చేయాలని నిర్ణయించింది. ఆ భూ సమస్యల స్థితి, స్థాయిని బట్టి ఎవరు పరిష్కరించాలనే దానికి త్వరలోనే గైడ్ లైన్స్ రూపొందించనున్నది. కోర్టు కేసులు మినహా మిగతా భూముల డేటాను పరిశీలించేందుకు కసరత్తు చేస్తున్నది. ఇలాంటి అనేకాంశాల్లో గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది అనివార్యంగా మారుతున్నది. అందుకే విలేజ్ లెవెల్ ఆఫీసర్ల పేరిట పూర్వపు వీఆర్వోలను ముందుగా తీసుకోనున్నారు.

నిండకపోతే.. వీఆర్ఏలు?

రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ గ్రామాల సంఖ్యకు అనుగుణంగా పూర్వపు వీఆర్వోలు రాకపోతే ఎట్లా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఆ ఖాళీ పోస్టుల్లో వీఆర్ఏలకు కూడా చాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఐతే ఇప్పటికే డైరెక్ట్ రిక్రూటీస్ లో డిగ్రీ, పీజీలు చేసిన వారు ఉన్నారు. వీఆర్వోల్లోనూ విద్యార్హతల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. వీఆర్ఏల్లోనూ గ్రాడ్రుయేట్స్ ఉన్నారు. ఈ నియామకాల్లో ఎలాంటి విధానాన్ని అనుసరిస్తారో వేచి చూడాలి.

ఫలించిన పోరాటం

వీఆర్వో, వీఆర్ఏల వ్యవస్థలను ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా రద్దు చేయడంతో పాటు లాటరీ పద్ధతిన వివిధ శాఖలకు పంపారంటూ చాలా కాలంగా ఉద్యోగులు పోరాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ తిరిగి తీసుకొస్తామంటూ హామీ ఇచ్చారు. భూ భారతిలోనూ గ్రామీణ పరిపాలన అనివార్యంగా చేశారు. ఈ క్రమంలోనే ఆప్షన్ల ద్వారా తిరిగి తీసుకునేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఈ ప్రక్రియ పూర్తిగా కలెక్టర్ల ద్వారానే పూర్తి చేయనున్నారు.

Tags:    

Similar News