కనీవినీ ఎరగని రీతిలో బోనాల ఉత్సవాలు

కనీవినీ ఎరగని రీతిలో గోల్కొండ బోనాల ఉత్సవాలను నిర్వహిస్తామని మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తెలిపారు.

Update: 2024-06-26 14:28 GMT

దిశ, మెహిదీపట్నం : కనీవినీ ఎరగని రీతిలో గోల్కొండ బోనాల ఉత్సవాలను నిర్వహిస్తామని మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తెలిపారు. ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందన్నారు. గోల్కొండ ఉత్సవాల నేపథ్యంలో బుధవారం గోల్కొండ కోటలో వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఈసారి బోనాల వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. చిన్నపిల్లలు, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల నుంచి గోల్కొండకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నిర్వహిస్తామని పేర్కొన్నారు. గతంలో కంటే ఈసారి సౌకర్యాలను రెట్టింపు చేస్తామన్నారు.

     నీటి పంపిణీ, ఫైర్ సేవలతో పాటు మిగతా వసతులను మరింత పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా మహిళలు చిన్నారులకు ఫీడింగ్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. క్యూలైన్లను పక్కాగా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. బోనాలతో పైకి వెళ్లేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇప్పటికే ఈవో ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు. బోనాల వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. బోనాల ఉత్సవాలను హిందూ ముస్లింలు

    సోదర భావంతో నిర్వహించుకోవడం నగరంలో ప్రత్యేకత అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ వన్ ఎమ్మెల్యే కౌసర్ మోహినుద్దీన్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, డీసీసీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీబీ సయ్యద్ ఫయాజ్, ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు, వివిధ శాఖల అధికారులు, గోల్కొండ వృత్తి పనివారాల సంఘం అధ్యక్షుడు బొమ్మల సాయిబాబా చారి తదితరులు పాల్గొన్నారు. 

Similar News